తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఎజెండాతో ఎన్నికల ముందు కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చింది. ఆరు గ్యారెంటీలతో పాటు రైతు, యువ, బీసీ డిక్లరేషన్లను కూడా ప్రకటించింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది. మొత్తం 14 హామీల్లో కేవలం ఆరింటినే పాక్షికంగా అమలు చేసి మిగతావాటి జోలి వదిలేసింది. ప్రతిపక్షాలు ఎండగడుతున్నా.. ప్రజలు నిలదీస్తున్నా కుంటిసాకులు చెప్తూ తప్పించుకుంటున్నది.
ఇండియా టుడే కాన్క్లేవ్లోజర్నలిస్ట్ ప్రీతి ప్రశ్న: గ్యారెంటీల గురించి అడిగితే మీరు అప్పుల గురించి చెప్తున్నారు. రెడ్డి గారూ.. దీనికి సంబంధించి నేను కొన్ని గణాంకాలు చెప్తాను. అప్పులు ఉన్నాయని తెలిసినప్పటికీ.. 2024 బడ్జెట్లో రూ. 50 వేల కోట్లను గ్యారెంటీలకు కేటాయించారు. కొత్త అప్పులు రూ. 80 వేల కోట్లు చేయనున్నట్టు చెప్పారు. అప్పులు ఉన్నప్పుడు హామీలెలా ఇచ్చారు?
రేవంత్ సమాధానం: మరేం చెయ్యాలి. అలాగే రేసు (ఎన్నికల పరుగుపందెం) నడుస్తుంది కదా ప్రీతీజీ ! రేసులోకి (ఎన్నికల బరిలోకి) దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’ అనే స్లోగన్ తెలుసు కదా.. ఇదీ అలాగే.. ! అయి నా.. ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారెంటీలు ఇచ్చారు. మరెవ్వరూ ఆయన్ని ప్రశ్నించరే?! ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్లను కూడా మూలధన వ్యయానికి, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు.
సారాంశం: గ్యారెంటీలు అమలు చేయలేమనే పరోక్ష సందేశం
Telangana | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కావాలనే మోసం చేసిందా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందే తెలుసా? తెలిసి కేవలం అధికారం కోసమే అడ్డగోలుగా హామీలు గుమ్మరిచ్చిందా? దీనిపై రాష్ట్రంలో పనిచేసిన అధిష్ఠానం దూతలు పార్టీ అగ్రనేతలను ముందే హెచ్చరించారా? ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. అధికారం సాధించడమే ముఖ్యం.. మిగతా సంగతి తర్వాత చూద్దాం అని వాళ్ల నోర్లు మూ యించారా? అధికార రేసులో ఉండేందుకు హామీలు ఇచ్చామన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరుతో హామీలు గుప్పించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ హామీలన్నింటిని అమలు చేస్తామంటూ నాడు మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ‘420’ రోజులు దాటినా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తుంటే.. కుంటిసాకులు చెప్తూ తప్పించుకుంటున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద కథే నడిచినట్టు తాజాగా తెలిసింది. మీనాక్షి నటరాజన్.. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిపై ముందుగానే హెచ్చరించినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఇస్తున్న హామీలు అమలుచేయడం సాధ్యం కాదని, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ఆమె హెచ్చరికల్ని బేఖాతరు చేసిన అధిష్ఠానం.. అధికారం దక్కించుకోవడమే ఏకైక ఎజెండాగా ఆరు గ్యారెంటీలను గుప్పించినట్టు తెలిసింది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. మీనాక్షి నటరాజన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున పోల్ అబ్జర్వర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో క్షేత్రస్థాయిలోని అంశాలపై కచ్చితమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆమెను అధిష్ఠానం ఆదేశించింది.
ఇందులో భాగంగానే ఇక్కడ జరుగుతున్న అన్ని పరిణామాలు, పరిస్థితులపై నేరుగా అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ వచ్చారు. మీనాక్షి నటరాజన్‌కు పార్టీలో ముక్కుసూటి మనిషిగా పేరుంది. దీంతోపాటు ఆమె రాహుల్‌గాంధీకి సన్నిహితురాలు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న హామీలు, గ్యారెంటీలపై ఆమె ఆశ్చర్యానికి గురైనట్టు తెలిసింది. ఈ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సరిపోదని ఆమె అప్పుడే తేల్చిచెప్పారట. ఇందుకు సంబంధించి నేరుగా రాహుల్ గాంధీకి పూర్తి వివరాలతో కూడిన టెక్నికల్ రిపోర్ట్‌ను అందించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆమె పలు హెచ్చరికలు కూడా చేసినట్టు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై భారీగా ఆర్థిక భారం పడుతుందని, ఒకవేళ హామీలు అమలు చేయని పక్షంలో ప్రజల్లో పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఆరు గ్యారెంటీల అమలుపై మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదికను, చేసిన హెచ్చరికలను రాహుల్‌గాంధీ బేఖాతరు చేసినట్టు తెలిసింది. ‘ఇవన్నీ కాదు.. ముందు మనం గెలవాలి’ అని రాహుల్‌గాంధీ బదులిచ్చినట్టు సమాచారం. ‘ఇవే గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం. ఏడాదైనా అక్కడ హామీలు అమలు చేయలేదు. ఏమైనా అయిందా. ఏం కాలేదు కదా. కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా లాంటిది. కాబట్టి అక్కడ కచ్చితంగా గెలవాలి. హామీల అమలు సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చేద్దాం. ఏం జరుగుతుందో ఆ తర్వాత చూసుకుందాం.’ అంటూ మీనాక్షి నటరాజన్‌కు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ర్టానికి పలుమార్లు వచ్చి ఆరు గ్యారెంటీలపై హామీలు గుప్పించి.. 100 రోజుల్లోనే అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన నమ్మక ద్రోహాన్ని బయటపెట్టాయి. ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారు. అంటే అన్నీ తెలిసే కేవలం అధికారం కోసమే ఆరు గ్యారెంటీల హామీలు గుప్పించినట్టు ఆయన వ్యాఖ్యలు వెల్లడించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మీడియా ప్రతినిధి సంభాషణ ఇలా కొనసాగింది..
మీడియా ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వానికి రూ. 3.75 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినా గ్యారెంటీల పేరుతో ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఉదాహరణకు నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, రైతులకు, వ్యవసాయ కూలీలకు పలు హామీలిచ్చారు. ఫండ్స్ లేనప్పుడు ఇన్ని హామీలు ఎందుకు ఎలా ఇచ్చారు? సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ‘గ్యారెంటీలకు డబ్బులు ఖర్చు చేయలేనని’ అర్థమైందా? మరి అప్పులు ఉన్నాయని తెలిసి, నిధులు లేవని తెలిసి కూడా బడ్జెట్లో గ్యారెంటీల అమలు కోసం రూ. 50వేల కోట్లు ఎలా కేటాయించారు? అప్పులున్నప్పుడు హామీలు ఎలా ఇచ్చారు?
సీఎం: మరేం చెయ్యాలి.. రేసు (ఎన్నికల పరుగుపందెం) అట్లనే నడుస్తున్నది కదా. రేసులోకి (ఎన్నికల బరిలోకి) దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’ అనే స్లోగన్ తెలుసు కదా.. ఇదీ అంతే! తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరపున కనీసం రూ.500 కోట్లను కూడా మూలధన వ్యయానికి, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజలను కావాలనే మోసం చేసిందనే విషయం తేటతెల్లమైంది. హామీల అమలు అసాధ్యమని ఆ పార్టీకి ముందే తెలుసు. అయినప్పటికీ కేవలం అధికారం కోసం.. గ్యారెంటీలను గుప్పించి.. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది.
అధికార దాహంతో వెంపర్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. అలవికాని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను వాడుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కాంగ్రెస్ నేతలకు పూర్తి అవగాహన ఉన్నది. తమ పార్టీ ఇచ్చే హామీలకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయని కూడా ఆ పార్టీ నేతలకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో హామీల అమలుకు అవసరమైన నిధులు సమకూర్చడం సాధ్యమయ్యే పని కూడా కాదని తెలుసు. దీనికితోడు అడ్డగోలు హామీలపై నాడే కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ హామీలపై ముందుకు వెళ్లినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.
ఆ హామీలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. 100 రోజుల్లో అమలు చేయాల్సిన గ్యారెంటీలను రేపు మాపు అంటూ సాగదీస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కుంటిసాకులు చెప్తున్నారు. మరి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఈ విషయం తెలియదా అని ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసే తమను మోసం చేసి.. అధికారం చేజిక్కించుకోవడానికే హామీలు ఇచ్చారా అంటూ నిలదీస్తున్నారు.
హామీల అమలుపై తానిచ్చిన నివేదికను పట్టించుకోకపోవడంతో అసంతృప్తికి గురైన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర అబ్జర్వర్ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆమె స్థానంలో అధిష్ఠానం అశోక్ శంకర్రావు చవాన్‌ను నియమించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయి తే మీనాక్షి నటరాజన్ ముందుగా హెచ్చిరించిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో కండ్ల ముందుకొచ్చాయి. హామీలు అమలు చేయకపోవడంతో రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గత ఇన్చార్జి దీపాదాస్ మున్షీపై ఆరోపణలు, వాస్తవ పరిస్థితులు ఢిల్లీకి చేరకపోవడంతో తెలంగాణ ఇన్చార్జిగా వెళ్లాలని రాహుల్‌గాంధీ మళ్లీ మీనాక్షి నటరాజన్‌ను కోరినట్టు తెలిసింది.
గత అనుభవాల దృష్ట్యా ఆమె నిరాకరించడంతో.. ‘ఈసారి అలా జరగబోదని, మీరు వెళ్లాల్సిందే.. మీరు ఏది చెప్పినా అడ్డు చెప్పబోము’ అని అధిష్ఠానం చెప్పినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చీరాగానే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి.. అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నదో అధిష్ఠానానికి పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో పలు సంచలన విషయాలను పొందుపరిచినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై మళ్లీ పునరాలోచనలో పడ్డ కాంగ్రెస్ అధిష్టానం.. ఈ నివేదికలపైనా చర్యలకు తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ నుంచి ఫండింగ్‌ను ఆశిస్తున్న అధిష్ఠానం మీనాక్షి నివేదికను పక్కకు పెట్టినట్టు తెలిసింది.