మణికొండ, మార్చి 16 : సరదాగా గండిపేటకు వచ్చిన ముగ్గురు యువకులు మూసీ కాలువలో స్నానం చేస్తూ మునిగిపోయిన ఘటన సోమవారం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. నార్సింగి ఏసీపీ జీవీ రమణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 15న ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన గోవర్థన్ ప్రసాద్ (26), అతని తమ్ముడు కార్తీక్(19), వారి స్నేహితుడు వెంకటేశ్ (19)లు గండిపేటకు బైక్‌లపై వెళ్లారు.
చెరువు దిగువ ప్రాంతమైన కేఎల్ఆర్ లేన్ సమీపంలోని మూసీ కాలువలోకి దిగి స్విమ్మింగ్ చేస్తూ లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ముగ్గురు లోతైన ప్రాంతంలో మునిగిపోయారు. దీంతో వీరి కోసం తల్లితండ్రులు అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. మూసీ కాలువ ఒడ్డున ముగ్గురు వ్యక్తుల బట్టలు కన్పించడాన్ని గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు ఆదివారం రాత్రి సమాచారం అందించారు. హుటాహుటిన హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూసీ కాలువలో అర్ధరాత్రి వరకు గాలించారు.
సోమవారం తెల్లవారు జామున ముగ్గురు యువకుల మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఏసీపీ రమణాగౌడ్ తెలిపారు. పిల్లలు సరదా మోజులో లోతైన ప్రాంతంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నారో అడగాలని సూచించారు.