మణికొండ,మార్చి 16 : అభం..శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా అతి కిరాతకంగా హత్యచేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఆదివారం చోటుచేసుకుంది. శేరీలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ జీవీ.రమణగౌడ్ కథనం ప్రకారం… జార్ఖాండ్ రాష్ర్టానికి చెందిన ఓ కుటుంబం తమ 4ఏళ్ల కూతురుతో కలిసి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి, పుప్పాలగూడ, లేబర్ కాలనీలో నివాసం ఉంటూ, రోజువారి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం ఉదయం తల్లితండ్రులు చిన్నారిని తమ గుడిసెలో వదిలేసి పక్కనే కొనసాగుతున్న పనుల్లోకి వెళ్లిపోయారు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారిపై పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన బిస్వా ఒరా(25) అనే వ్యక్తి కన్నుపడింది. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో గుడిసెలో ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని నమ్మబలికి వెంటబెట్టుకుని, పక్కనే ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత తలపై బండరాయితో అతి కిరాతకంగా మోది హత్యకు పాల్పడ్డారు.
అనంతరం ఎవ్వరికి అనుమానం రాకుండా తన గుడిసెలోకి వచ్చి పీకలదాక మద్యం తాగి నిద్రపోయాడు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు గుడిసెలో చిన్నారి కనిపించకపోవడంతో ఆచూకీ కోసం లేబర్ క్యాంపులో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా స్థానికంగా అందిన సమాచారం మేరకు సీసీ కెమెరాలను పరిశీలించారు.
విశ్వసనీయంగా అందిన సమాచారానికి సీసీ కెమెరాల ఫుటేజికి సరిపోలడంతో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలం నుంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా పోలీసులు నిందితుడిపై హత్య, పోక్సో తదితర కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.