దండేపల్లి/ఖానాపూర్, మార్చి 16: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అజ్మీరా గోవింద్ నాయక్ (76) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తన నివాసంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గోవింద్ నాయక్ 1985లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.1985లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994లో టీడీపీ అభ్యర్థిగా, 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో గోవింద్నాయక్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది.
2004లో కారు గుర్తుపై పోటీ చేసి గోవింద్ నాయక్ గెలుపొందారు. అదే ఏడాది జిల్లా పర్యటనకు వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో గోవింద్‌నాయక్ కేసీఆర్‌కు అండగా నిలిచారు. గోవింద్ నాయక్ మృతి పట్ల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ సంతాపం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.