నమస్తే యంత్రాంగం, ఆగస్టు 17: గులాబీ దళం కదం తొక్కింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు మండల కార్యాలయాల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. పేదల సంక్షేమంతో రాజకీయం చేయడం సరికాదని, కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు లు ఆందోళనలు చేపట్టాయి. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అలాగే, నవీపేట్, నందిపేట్, ఆర్మూర్, మాక్లూ ర్, కోటగిరి, పొతంగల్, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, భిక్కనూరు, రామారెడ్డి, దోమకొండ, కామారెడ్డి, గాంధారి, బీబీపేట, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లోనూ గులాబీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

రెంజల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. బీబీపేటలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కల్యాణలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వినతిపత్రం అందించారు.