హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి 2027-28 విద్యాసంవత్సరంలో ప్రత్యేకంగా ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్టు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా ఫస్టియర్ సీట్లు భర్తీచేస్తున్నారు. ఇంటర్ మెరిట్, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని సీట్లు భర్తీచేస్తున్నారు. ఎంట్రెన్స్ టెస్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, ఇంటర్ మెరిట్ మార్కులతో సీట్లు భర్తీచేసే విధానం రద్దవుతుంది. తొలుత దోస్త్ నోటిఫికేషన్ జారీచేస్తారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) సైతం డిగ్రీలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉండాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా 275 యూనివర్సిటీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోర్ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలే కాకుండా కొన్ని స్టేట్, డీమ్డ్, ప్రైవేట్, యూనివర్సిటీలు సీయూఈటీ(యూ జీ) స్కోర్ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం..
ఈ ప్రవేశ పరీక్షతో రాష్ట్రంలోని నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం వేయవచ్చన్న భావనలో అధికారులున్నారు. రాష్ట్రంలో 58 నాన్దోస్త్ కాలేజీలున్నాయి. ఎయిడెడ్కాలేజీలు 12 ఉండగా, 46 ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో 36,637 సీట్లున్నాయి. ఈ సీట్లను సదరు కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుంటున్నాయి. ప్రవేశ పరీక్ష పెట్టి, మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేస్తే తాము సైతం దోస్త్‌లో చేరుతామని సదరు కాలేజీలు అంటున్నాయి. ప్రవేశ పరీక్ష పెడితే ఈ సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.