Divorce Celebrations : సాధారణంగా ఎవరైనా పెళ్లిళ్లు, పండుగలు, పెళ్లిరోజులు, పుట్టినరోజులు, ఇతర శుభ సందర్భాల్లో సంబురాలు చేసుకుంటారు. కానీ, ఓ రిటైర్డ్ న్యాయమూర్తి (Retired Judge) కుటుంబం మాత్రం ఆయన కుమార్తె విడాకుల (Daughter’s Divorce) వేడుకను సంబురంగా జరుపుకుంది. బ్యాండ్ బాజాలు, మేళతాళాలు, ఆటపాటలు, విందు భోజనాలతో అచ్చం పెళ్లి మాదిరిగానే వేడుక నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ ఘటన జరిగింది.
మేరఠ్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్ శర్మ కుటుంబం సంప్రదాయ సామాజిక వైఖరులకు పూర్తి భిన్నంగా కుమార్తె విడాకుల మంజూరును ఓ వేడుకలా జరుపుకున్నది. సైకాలజీలో పీజీ చేసిన శర్మ కుమార్తె ప్రణీత వశిష్ఠకు 2018లో ఆర్మీ మేజర్‌తో వివాహమైంది. దంపతుల మధ్య వివాదాల నేపథ్యంలో మేరఠ్‌లోని కుటుంబ న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
ప్రణీత కోర్టు నుంచి బయటకు రాగానే కుటుంబసభ్యులు పూలమాలలు వేసి, మేళ తాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకుని వెళ్లారు. ఈ ఊరేగింపు సందర్భంగా ప్రణీత కుటుంబసభ్యులందరూ ‘ఐ లవ్ మై డాటర్’ అంటూ ప్రణీత చిత్రాలు కలిగిన టీషర్టులు ధరించారు. వైవాహిక జీవితంలో తన కుమార్తె సంతోషంగా లేదంటే.. ఆ వాతావరణం నుంచి ఆమెను బయటకు తీసుకురావడం తన విధి అని అన్నారు.
విడాకుల సందర్భంగా ఏమైనా భరణాలు తీసుకుంటున్నారా అని స్థానిక మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కుమార్తెలు అంటే ఆస్తులు కాదని, తమకు ఎటువంటి భరణాలు అక్కర్లేద అని జ్ఞానేంద్రకుమార్ చెప్పారు.