హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింది. తాజాగా నిర్వహించిన సమీక్షలో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అంచనా వ్యయం పెంపు విషయాన్ని వెల్లడించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రూపొందించారు. 2005లో జీవో-140 ద్వారా ప్రాజెక్టు పనులకు రూ.2,292 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను రూ.1,925 కోట్లతో మొత్తంగా ఐదేండ్లలో అంటే 2010 ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ అగ్రిమెంట్ చేసుకొన్నది. ఇప్పటివరకు ఆరుసార్లు కాంట్రాక్టు ఏజెన్సీకి గడువు పొడిగించారు.
చివరిసారి ఇచ్చిన గడువు ప్రకారం కూడా 2026 జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. అయితే, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండువైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి, అవుట్లెట్ అంటే మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి 13.93 కిలోమీటర్ల సొరంగం తవ్వగా, 2025 ఫిబ్రవరిలో టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతుకాగా, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే గుర్తించారు. ఇప్పటికీ ఆరుగురు కార్మికుల జాడ గుర్తించలేదు. మరోవైపు, ప్రమాదంతో ఇన్లెట్ పనులు నిలిచిపోయాయి. ఇక అవుట్లెట్ వైపు నుంచి దాదాపు 22 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)కు మరమ్మతులతో అక్కడ పనులు కొనసాగని దుస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు ఇన్లెట్, అవుట్లెట్ రెండువైపుల నుంచి కలిపి 34.372 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తికాగా, ఇంకా 9.560 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉన్నది.
ఇక టీబీఎంతో పనులు కొనసాగని నేపథ్యంలో పనులను డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్‌లో పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,658 కోట్లకు సవరిస్తూ గత అక్టోబర్‌లో అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించగా, ప్రభుత్వం ఆమోదించింది. జీవో- 290ను ప్రభుత్వం జారీ చేసింది. దాని ప్రకారం మిగిలిపోయిన 9.56 కిలోమీటర్ల సొరంగం పనులను పూర్తి చేసే బాధ్యతను సదరు ఏజెన్సీకే అప్పగించారు. తాజాగా ఏడాది కూడా పూర్తికాకముందే ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ.12,718 కోట్లకు పెంచారు. అంటే ఈ లెక్కన కిలోమీటర్‌కు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట! మొత్తంగా ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కన్నా మిగిలిన పనుల పూర్తికే అత్యధిక నిధులు అవసరమవుతుండటం గమనార్హం. దీంతో సొరంగం పనుల పేరిట భారీ దోపిడీకి తెరతీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును జూన్ 2028 నాటికి తప్పక పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి వెల్లడించారు. కార్మికుల భద్రతపై రాజీ ఉండబోదని వివరించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతస్థాయి అధికారులతో కలిసి సచివాలయంలో సమీక్షించారు. పనుల పూర్తికి కావాల్సిన నిధులు, భూసేకరణ, సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని, టన్నెల్తోపాటు డిండి ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
దేవరకొండ వైపు నుంచి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే అర కిలోమీటర్ వరకు పూర్తిచేశామని, శ్రీశైలం వైపు నుంచి కూడా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగిస్తున్నామని తెలిపారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు మూడు అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు నెలాఖరులోగా వస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం సుమారు రూ.12,718 కోట్లని, నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్నారు. జూన్ 2028 నాటికి అన్ని పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) రమేశ్‌బాబు, ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
