Panchayat Elections |తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
తొలిదశలో 4,236 గ్రామాలకు ఎన్నికలు జరుగనుండగా.. 37,450 వార్డుల్లో పోలింగ్ డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. అదే సమయంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,236 గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది.