Joiginapally Santosh Kumar | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావును విచారించిన సిట్.. తాజాగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు నోటీసులు జారీచేసింది. సోమవారం కొండాపూర్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ కేసులో 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన విచారణాధికారి.. ఆ కేసులో వాస్తవ పరిస్థితులు, ఇతర విషయాలు సంతోష్‌కుమార్‌కు తెలుసునని, వాటిపై విచారించేందుకు తమ ఎదుట మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, సిట్ ఇచ్చిన నోటీసులకు సంతోష్‌కుమార్ స్పందించారు. ఎలాంటి తప్పు చేయలేదని, తప్పనిసరిగా సిట్ అధికారుల విచారణకు హాజరవుతానని స్పష్టంచేశారు. సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేరొన్నారు.
తాను చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణ ఎదురోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంతోష్‌కు నోటీసుల జారీపై సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. విచారణ ప్రక్రియ ఒక అట్టర్‌ఫ్లాప్ టీవీ సీరియల్‌ను తలపిస్తున్నదని ఎద్దేవా చేశారు. బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో సంబంధంలేని ప్రతిపక్ష నాయకులను వరుసగా విచారణకు పిలువడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని దుయ్యబట్టారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే విచారణ పేరిట బీఆర్ఎస్ నేతలపై వేధింపులకు దిగుతున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. నైని బొగ్గు గనుల కుంభకోణం బట్టబయలై ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నదని, ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల నాటకమని ధ్వజమెత్తారు. గతంలో హరీశ్‌రావు, తనను కూడా సిట్ విచారణ పేరిట విచారించి ఏమీ సాధించలేకపోయిన ప్రభుత్వపెద్దలు ఇప్పుడు సంతోష్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. తాము గవర్నర్ వద్దకు వెళ్లి బొగ్గు కుంభకోణంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన సమయంలో సంతోష్‌కు నోటీసులు జారీ చేసి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని దుయ్యబట్టారు. సంతోష్‌కు పార్టీ అండగా ఉంటుందని, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.
గవర్నర్‌కు కలిసేందుకు వెళ్తున్నందుకే కక్ష: హరీశ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సిట్ నోటీసులను రాజకీయ అస్త్రంగా ఉపయోగించడం సర్వసాధారణమైపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాను బొగ్గు కుంభకోణాన్ని బట్టబయలు చేసిన తర్వాత, ప్రజల దృష్టిని మళ్లించడానికే తనకు నోటీసులు ఇచ్చిందని దుయ్యబట్టారు. కేటీఆర్ కూడా ఇదే బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తినప్పుడు, ఆయనకు కూడా సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలు, దోపిడీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్‌ను కలువాల్సి ఉన్న తరుణంలో.. మళ్లీ దృష్టి మళ్లించే లక్ష్యంతో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు హడావుడిగా నోటీసు జారీ చేశారని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న నిజాలు ఒకొకటిగా బయటకు వస్తున్నాయని, కక్షపూరిత, దృష్టి మళ్లింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
రేవంత్‌ది ప్రతీకార పాలన: వేముల ప్రశాంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇచ్చారని ఖండించారు. ఎన్నడూ ప్రభుత్వంలో లేని ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పాలనను గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులుపెట్టడమే పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు. సింగరేణి కోల్‌స్కామ్‌లో సీఎం, మంత్రుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతోనే పక్కదోవ పట్టించేందుకే సిట్ పేరిట నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కుట్రలను కట్టిపెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. సంతోష్‌కుమార్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసులు: వద్దిరాజు రవిచంద్ర
బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడటం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులను సిట్, కమిషన్ల పేరుతో పోలీసుల చేత ఇబ్బందులకు గురి చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి ఎజెండాగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమని పేర్కొన్నారు.
కక్ష సాధించడానికే సంతోష్‌కు నోటీసులు:పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో సంతోష్‌కుమార్‌ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటినుంచీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పస లేని కేసు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కేసును వాడుకుంటున్నారని చెప్పారు.
అక్రమ కేసులతో మనోైస్థెరం దెబ్బతీయలేరు: దాసోజు శ్రవణ్
కక్ష సాధింపులో భాగంగానే మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలను కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించేందుకే ఇలాంటి దుర్మార్గపు పోకడలకు దిగుతున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులు, విచారణలతో బీఆర్ఎస్ నేతల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేశారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఆపబోమని చెప్పారు.
ప్రతిపక్షాన్ని భయపెట్టలేవు: పాడి కౌశిక్‌రెడ్డి
రాజకీయ కక్షతో సంతోష్‌కుమార్‌పై తప్పుడు కేసులు బనాయించడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు అవమానమని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఆడుతున్న డైవర్షన్ రాజకీయాలని మండిపడ్డారు.
ఎన్ని నోటీసులిచ్చినా పోరాటాలు ఆపం: దేవీప్రసాద్
బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతిపై పోరాటాలు ఆపేదిలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ తెలిపారు. సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం టీవీ సీరియల్‌ను తలపిస్తున్నదని ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కుంభకోణంలో ఇరుక్కుపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు విచారణ పేరిట ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా కృషి చేస్తున్న సంతోష్‌కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
బీఆర్ఎస్ను వేధించడమే కాంగ్రెస్ లక్ష్యం: పోచంపల్లి
బీఆర్ఎస్ను వేధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కాంగ్రె స్ అవినీతి బండారాన్ని బయట పెడుతూనే ఉంటామని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నో రోజులు నడువవని, ఇక కాంగ్రెస్ ఆటలు సాగవని హెచ్చరించారు.
డైవర్షన్‌కే సిట్ నోటీసులు: మన్నె క్రిశాంక్
కోల్ స్కామ్ నుంచి డైవర్షన్‌కే సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేటీఆర్ నేతృత్వంలోని బృందం మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కోల్ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కొత్త నాటాకానికి తెరలేపిందని మండిపడ్డారు.
రక్తికట్టేలా సిట్ డ్రామాలు: బాలరాజు యాదవ్
మున్సిపల్ ఎన్నికలు మొత్తం నోటీసులతోనే జరుగుతున్నాయని, కాంగ్రెస్ రాజకీయ నాటకం బాగా రక్తికడుతున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎద్దేవా చేశారు. ఈ డ్రామాలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం తప్పదని హెచ్చరించారు. కక్ష సాధింపు ధోరణిలోనే మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్టు చేప్పారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగమే: పల్లె రవికుమార్
బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేమీ కాదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ పేర్కొన్నారు. బొగ్గు గనుల కుంభకోణంలో పీకల లోతుగా ఇరుకుపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి సిట్ విచారణ టీవీ సీరియల్‌ను నడిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థతను మున్సిపల్ ఎన్నికల్లో డైవర్ట్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని విమర్శించారు.
ప్రతిపక్షంపై సిట్ ప్రయోగం: వెంకటేశ్వర్‌రెడ్డి
సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపు చర్యల్లో భాగమేనని సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఈ విచారణ టీవీ సీరియల్‌ను తలపిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయలేక ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై సిట్‌ను ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి కుట్రలు: వై సతీశ్‌రెడ్డి
ప్రజాపాలన.. మార్పు అంటూ గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొదటిరోజు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గానే రాజకీయాలు చేస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటించాలన్న లక్ష్యంతో ఫోన్‌ట్యాపింగ్ పేరిట ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బొగ్గు గనుల కుంభకోణంలో ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్‌ట్యాపింగ్ పేరుతో కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. స్వయంగా మంత్రి కొడుకు.. వందల కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టినా చర్యలు లేవని, ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ అవినీతి బాగోతం రోడ్డున పడటంతో.. ఏకంగా కేసీఆర్‌పైనే బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు.
రాజకీయ కుట్రలో భాగంగానే: కిశోర్‌గౌడ్
కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఆరోపించారు. బొగ్గు బ్లాకుల్లో కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన బీఆర్ఎస్పై బురదజల్లుతున్నదని విమర్శించారు. రేవంత్ సర్కార్ అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కేసులపై ఉన్న ధ్యాస పాలనపై లేదని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాల గొంతులు నొకలేరు: ఉపేంద్ర
సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర పేర్కొన్నారు. తప్పుడు కేసులు, కమిషన్ రిపోర్టులు, నోటీసులకు ఉద్యమకారులు భయపడే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం సిట్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు.