ఎల్లారెడ్డి, నవంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోవడంతో ‘రాంనామ్ జప్నా.. పరాయా లీడర్ అప్నా’ అనే రీతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా బలం పెంచుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం చేస్తున్నదని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో విచారణ చేయవద్దని అంటున్నారని, బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విచారణకు ఆ పార్టీ నాయకుడు బీఎల్ సంతోష్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ యువకులకు ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా లోకల్ రిజర్వేషన్ అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు రాకుండా ప్రధాని అడ్డుకున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల కోసం వేచి చూసి ఇప్పుడు 96 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నదని, గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణలోని పథకాలపై చర్చకు సిద్ధమా?
తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ ఇతర రాష్ర్టాల్లో లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై చర్చకు రావాలని అన్ని పార్టీలకు బహిరంగ సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. కానీ ఆ మొత్తం మోదీ ఇస్తున్నట్టు వాట్సప్‌లో బీజేపీ ప్రచారం చేస్తున్నదని, దీన్ని తిప్పికొట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటిలో 95 శాతం సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ వారే ఉన్నారంటే గులాబీ పార్టీకి రాష్ట్రంలో ఎంత బలం ఉన్నదో ప్రతిపక్షాలకు తెలియాలని కవిత అన్నారు. రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన మోదీ.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకం పెట్టారని గుర్తుచేశారు. ఈ పథకం నుంచి 10 కోట్ల మంది రైతులను తప్పించారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో తెలియడం లేదన్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దుర్గమ్మ, త్రిలింగేశ్వర ఆలయం కలిపి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.