నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పొద్దున లేస్తే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామం టూ ఊదరగొట్టే పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే కొనుగో లు పరిస్థితి దారుణంగా ఉన్నది. పక్షం రోజులుగా కేంద్రాలకు ధాన్యం పెద్ద ఎత్తు న వస్తున్నా కొనుగోలు గాడిన పడటంలేదు. శనివారం నాటికి ఉత్తమ్ సొంత ఇలాకా సూర్యాపేటలో కేవలం 28 టన్ను లే కొనుగోలు చేయగా నల్లగొండ జిల్లాలో 9,500 టన్నులే కొన్నారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంలో కనీసం ఒక్క శాతం కొనుగోలు కూడా జరుగలేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరు నత్తకు నడక నేర్పుతున్న చందాన్ని తలపిస్తున్న ది. సగం వరి కోతలు పూర్తి కావస్తున్నా కొనుగోలు జాడ మాత్రం లేదు. కేసీఆర్ హయాంలో మార్చి మూడో వారం నుంచే కొనుగోళ్ల ప్రక్రియ మొదలయ్యేది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏప్రిల్ మధ్యలోకి వచ్చినా నేటికి కొనుగోలుపై దృష్టిసారించిన దాఖలాలు లేవు. అందు కు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులే సాక్ష్యం గా నిలుస్తున్నాయి. సివిల్ సైప్లె అధికారుల లెక్కల ప్రకారమే జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉన్నదని స్పష్టమవుతున్నది. సూర్యాపేట జిల్లాలో యాసంగిలో దొడ్డురకం ధాన్యం 5.60 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసి అందులో 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. 228 కేంద్రాలకు 212 కేంద్రాలే తెరిచారు. కానీ వీటిల్లో శనివారం మేళ్లచెర్వు ఒక్క కేంద్రంలోనే కొనుగోలు ప్రారంభం కాగా 28 టన్నులే కొనడం గమనార్హం. ఇప్పటికే ఈ జిల్లాలో 50 శాతానికిపైగా వరికోతలు పూర్తయ్యాయి. లక్ష టన్నుల ధాన్యం కేంద్రాల్లో మూలుగుతున్నట్టు అంచనా.
నల్లగొండ జిల్లాలో 9,500 టన్నులే..
ఇక నల్లగొండ జిల్లాలోనూ కొనుగోలు తీరు దారుణంగా ఉన్నది. రాష్ట్రంలోనే కామారెడ్డి తర్వాత అత్యధిక ధాన్యం కొ నుగోలు జరిగే జిల్లాల్లో నల్లగొండ రెండో స్థానం. ఈ ఏడాది కూడా 5.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుపాలని టార్గెట్గా పెట్టుకున్నారు. గత ఏడాది మార్చి 25 నుంచే కొనుగోళ్లు ప్రారంభించగా ఈ సీజన్లో ఈ నెల రెండో వారం నుంచి మొదలయ్యాయి. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు ప్రారంభించాల్సి ఉ న్నందున వారి షెడ్యూల్ కోసం కూడా వారం రోజులు ఆలస్యమైనట్టు సమాచారం. శనివారం నాటికి జిల్లాలోని కేంద్రాల్లో 2.11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నది. కొనుగోలు చేసింది మాత్రం కేవలం 9,548 టన్నులే కావడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో మొత్తం 428 కేంద్రాలకు 276 కేంద్రాలు ప్రారంభించి నేటికి 85 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపడుతున్నారు. ఆయా కేంద్రాలకు రైతులు పెద్ద మొత్తంలో ధాన్యం తెచ్చి పక్షం రోజులుగా ఎదురుచూస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2,20,809 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగా ఇం దులో 9,500 కొనుగోలు చేయగా ఇంకా 2,11,261 టన్నుల ధాన్యం కేంద్రాల్లో మూలుగుతున్నది. మరో వారం పది రోజుల్లో మరో రెండు లక్షల టన్నులకు పైగా ధాన్యం కేంద్రాలకు రానున్నదని అంచనా. ఇదిలావుంటే కొనుగోలు చేసిన ధాన్యంలో నేటికి ఒక్క క్వింటాల్ కూడా ట్యాబ్ ఎంట్రీ కాలేదు. అంటే రైతులకు రూపాయి కూడా చెల్లింపులు జరుగలేదు.