హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు.. దక్షిణ భాగానికి అలైన్‌మెంటు ఖరారైంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఉత్తరభాగం రహదారికి అవసరమైన అనుమతులు ఇవ్వకుండా టెండర్ల ప్రక్రియను ఆరు నెలలుగా సాగదీస్తూ వస్తున్నది. బాధిత రైతులు నష్టపరిహారం కోసం ఆర్బిట్రేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలా ట్రిపుల్ ఆర్ వ్యవహారమంతా గందరగోళంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో అయోమయం నెలకొన్నది.
సంగారెడ్డి జిల్లా పరిధిలో గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 161.518 కిలోమీటర్ల వరకు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం నిరుడు డిసెంబర్ నుంచి జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. దీనికి కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని అనుమతులు రాలేదు.
ఈ మధ్యలో నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మార్చారు. దీంతో టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉత్తరభాగం రహదారి నిర్మాణానికి దాదాపు 1,950 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇందులో 95 శాతం వరకు భూసేకరణ పూర్తయినట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. రైతులకు రూ.5,100 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనాలు రూపొందించగా, అందులో సగం, అంటే రూ.2,550 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది.
మరోవైపు, అవార్డ్ పాస్ చేసిన భూముల రైతులు తమకు ఇవ్వజూపిన నష్టపరిహారం సరిపోదని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ట్రిపుల్ ఆర్ నిర్మిస్తున్న జిల్లాల్లో ప్రభుత్వం భూముల ధరలను పెంచడంతోపాటు ట్రిపుల్ ఆర్ భూసేకరణలో సమస్యల పరిష్కారానికి ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటుచేసింది.
రైతులు నష్టపరిహారం పెంచాలని కోరుతూ ఆర్బిట్రేషన్‌కు అర్జీలు పెట్టుకున్నారు. ఆర్బిట్రేషన్‌లో కొందరు రైతులకు ఎకరాకు రూ.కోటి, మరికొందరికి రూ.50 లక్షల చొప్పున కూడా నష్ట పరిహారం ఖరారు చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్బిట్రేషన్‌లో నష్టపరిహారం ఖరారు చేసిన రైతులకు కూడా చెల్లింపులు జరగడంలేదు. ఈ పరిహారంలో జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ట్రిపుల్ ఆర్కు రూ.1,250 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరోవైపు, నష్టపరిహారం కోసం రైతులు అటు ఆర్బిట్రేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలతోపాటు రాయగిరి, యాదాద్రి, సిద్దిపేట తదితర ప్రాంతాలకు చెందిన రైతులు నష్టపరిహారం పెంచాలని, అవార్డ్ పాస్ చేసిన విధంగా వెంటనే చెల్లింపులు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర క్యాబినెట్ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం రహదారికి ప్రతిపాదిత అలైన్మెంటుకు ఆమోదం తెలిపింది. దీనిప్రకారం దక్షిణ భాగం రహదారిని చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 201 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ భూములే ప్రభావితం అమవుతున్నట్టు, రైతులకు పెద్దగా నష్టం జరగని విధంగా అలైన్‌మెంటును రూపొందించినట్టు అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపాక భూసేకరణ ప్రక్రియ, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. ఉత్తర భాగంలో నష్టపోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకుంటే, దక్షిణ భాగం పనులు త్వరితగతిన ముందుకు సాగుతాయని అంటున్నారు.