Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 18 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతి రెండో పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటిదశ నష్టాల్లో నడుస్తున్నందున రెండో దశలో భాగస్వామ్యానికి ప్రైవేటు కంపెనీలు ముందుకురావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలు, సర్వేలను పక్కనపెట్టిన కాంగ్రెస్ సర్కారు రెండోదశకు కొత్తగా ప్రతిపాదనలు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తంతు అంతటితోనే ఆగిపోయింది. ఇక ముందుకు కదలడం కూడా అసాధ్యమని తెలుస్తున్నది. సైఫాబాద్‌లోని ఏజీ కార్యాలయంలో సోమవారం నిర్వహంచిన ఆడిట్ వీక్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎన్వీఎస్ రెడ్డి మెట్రోపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఎల్అండ్టీ కంపెనీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.14వేల కోట్ల పైచిలుకు అంచనా వ్యయం ఉండగా ఇందులో కేంద్రం వాటా పదిశాతం. ఇందులోనూ రూ.254 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 2017 నుంచి దశలవారీగా అందుబాటులోకి వచ్చిన మెట్రో మొదటి దశను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే నిర్వహిస్తున్నది. ఈ ప్రాజెక్టు ఏటా రూ.1300 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.6వేల కోట్లకు పైగా నష్టాలకు చేరుకుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రెండో దశను పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రావడం లేదన్నారు.
మెట్రో మొదటి దశలో భాగమైన ఎంజీబీఎస్-ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. ఆ రూట్‌ను మరో 2 కిలో మీటర్ల పొడవు పెంచి చాంద్రాయణగుట్ట వరకు రైలు నడుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ ఇది అయ్యే పని కాదని మా వల్ల కాదు మొర్రో అంటూ ఎల్అండ్టీ చేతులెత్తేసింది. ప్రభుత్వం ముందుకొస్తే పనులు చేస్తామని స్పష్టంచేసింది..
కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును చేపట్టింది. 31 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుకు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేసి, టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేసింది. 76 కిలోమీటర్లతో వివిధ మార్గాల్లో రెండో దశ మెట్రోకు రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చి, 18 శాతం ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించినా వచ్చేది రూ.4వేల కోట్ల పైచిలుకు మాత్రమే. మిగిలిన రూ.20వేల కోట్లు ఎక్కడి నుంచి సమీకరించాలనేది సవాల్‌గా మారింది. ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకోవాలన్నా అది 48 శాతం వరకు మాత్రమే పరిమితమవుతుందని ఓ అధికారి తెలిపారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల చిక్కుముళ్లను అధిగమించి రుణాలు తీసుకున్నా రూ.9600 కోట్ల వరకు సమకూరుతుంది. రేవంత్ సర్కారు నిధులు సమీకరణలో మొదటి అడుగు కూడా వేయలేదు. ఒకవేళ ఈ సవాళ్లను అధిగమించినా రూ.11వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
మెట్రో మొదటి దశ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీకి భారీగా నష్టం వాటిల్లింది. రెండో దశ పనులు చేపట్టేందుకు ప్రైవేటు సంస్థ లు ముందుకు రావడంలేదు. రెండో దశలో 76 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతున్నాం. మిగితా రాష్ర్టాల్లో ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయి. . ఫేజ్-2 మెట్రో కోసం రూ. 24,269 అంచనా వ్యయంతో నిర్మాణం చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే రెండో దశ పనులను ప్రారంభిస్తాం..