పెద్దేముల్, డిసెంబర్ 3 : పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తండా(ఐ) పంచాయతీలకు సంబంధించి నామినేషన్లను గోట్లపల్లిలో స్వీకరించారు. మొదటి విడతలో భాగంగా గత నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు.
బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి గోట్లపల్లి పంచాయతీ కార్యాలయ తాళం పగులగొట్టి గిర్మాపూర్, హన్మాపూర్, జైరాంతండాకు సంబంధించిన నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం గుర్తించిన అధికారులు ఎంపీడీవో, పోలీసులకు సమాచారమిచ్చారు. సబ్‌కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పెద్దేముల్ ఎస్సై శంకర్ అక్కడికి వచ్చి పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి కోటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.