హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చి పక్షం రోజులైనా కాంటా పెడ్తలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లోనే వడ్లను అమ్ముకోవడానికి నిరీక్షించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోతలు మొదలై ధాన్యం చేతికి వచ్చినా.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. హుస్నాబాద్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు వరికోతలను ఉధృతం చేయడంతో ధాన్యం మార్కెట్‌కు భారీగా తరలివస్తున్నది.
పదిహేను రోజులుగా ధాన్యం ట్రాక్టర్లలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు భారీగా రావడంతో యార్డు మొత్తం దిగుబడులతో నిండిపోయింది. కొత్తగా వచ్చే వారికి జాగా లేకుండాపోయింది. ఒక్క హుస్నాబాద్ మార్కెట్‌యార్డులోనే దాదాపు వెయ్యి క్వింటాళ్లకుపైగా ధాన్యం అమ్మకానికి సిద్ధ్దంగా ఉన్నది. మంత్రి పొన్నంతోపాటు, అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.