హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగంలో విషాద ఘటన జరిగి నిన్నటితో నెలరోజులు పూర్తయిందని, మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సొరంగం కూలడం, మృతదేహాల వెలికితీతలో జాప్యం జరుగుతుంటే కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నదని శనివారం ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలతో ఎనిమిది మంది కార్మికులను పొట్టనబెట్టుకున్నదని దుయ్యబట్టారు. భూభౌతిక శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఆ ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను మృత్యుకుహరంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు చెప్పిన డెడ్లైన్ల క్యాలెండర్ మారిందని, సహాయక చర్యలో మాత్రం ఎలాంటి పురోగతి రాలేదని పేర్కొన్నారు. గల్లంతైన వారి కుటుంబాల క్షోభకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.