CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఉన్న నాడు ఎవరినీ చూడలేదు. రూ.200 పెన్షన్ మొఖాన కొట్టి మీ చావు మిమ్మల్ని చావమ్మనది. మొదట రూ.1000 చేసి ఇవాళ రూ.2వేల పెన్షన్ చేసింది ఎవరు? ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ మళ్లీ రూ.5వేల పెన్షన్ పెంచుతామని ప్రకటించాం. భగత్‌ను గెలిపించండి అందరి పెన్షన్లు రూ.5వేలకు పెరుగుతయ్. ఎవరు మంచి చేస్తరు.. ఎవరు చెడు చేస్తరు అనే ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఆగమాగం ఓట్లు వేయొద్దు’ అని సూచించారు.
‘ప్రజలందరికీ ఈ విషయం ప్రజలకు తెలిసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజం.. ఏది రాయి.. ఏది రత్నమో చర్చపెట్టి ఓట్లు వేయించాలి. చర్చపెట్టండి.. భగత్ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తడు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామగ్రామం 30 తేదీలోగా ప్రతి గడపకూ ఈ సందేశం అందాలే. మన గెలుపును ఎవడూ ఆపలేడు. ఎన్ని మంచి కార్యక్రమాలు అమలు చేశాం. పేదవాళ్లు ఉంటరు. ఉన్నవాళ్లు ఉంటరు. కంటి వెలుగు కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడైనా నిర్వహించారా? కనీసం ఎవరైనా ఆలోచించారా? 3కోట్ల మంది కండ్ల పరీక్షలు చేసి బ్రహ్మాండంగా 8లక్షల మందికి కండ్ల అద్దాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. కేసీఆర్ కిట్ పెట్టాం. అమ్మ ఒడి వాహనాలు పెట్టాం. ప్రసవానికి గతంలో ప్రైవేటు దవాఖానాలకు వెళ్తే దోపిడీ పాలయ్యేది. ఇవాళ అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్లి ప్రసూతి చేయించి.. ఇంటికాడ దిగబెడుతున్నది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, పిలగాడు పుడితే రూ.12వేలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నది’ సీఎం కేసీఆర్ అంటూ గుర్తు చేశారు.
‘కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆనాడు దోపిడీకి గురైతే పట్టించుకున్నదా? ఆ నాడు వాళ్లు ఇచ్చిన బియ్యం ఎంత ? ఇవాళ ఇచ్చే బియ్యం ఎంత? ఎన్నికలు కాంగనే మార్చి నుంచి రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యమే సప్లయ్ చేస్తమని ప్రకటించాం. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భగత్ కోరిన కోర్కెలను తీర్చలేనివి కావు. వందశాతం భగత్‌ను గెలిపించండి.. ఆయన అడిగిన పనులన్నీ చేయిస్తా. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవడం ఖాయం.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్. ఎవడు ఎక్కడపోతడో తెలియదు. వాళ్ల చేతిలో రాజ్యం పడితే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే అయితది. ఆలోచించి ఓటు వేయాలి.. నిర్ణయం తీసుకోవాలి. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజల దృష్టిలోకి కార్యకర్తలు తీసుకెళ్లాలి’ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.