Errolla Srinivas | ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను భారత దేశ చరిత్ర నుంచి ఎప్పటికీ, ఎవరూ తుడిచిపెట్టలేరని వ్యాఖ్యానించారు.
ఆనాడు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఆ అకృత్యాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతో ఎమర్జెన్సీపై వేసిన మాజీ సీజేఐ జస్టిస్ జేసీ షా కమిషన్ నివేదికను ధ్వంసం చేసిన నీతిమాలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద చార్జ్ షీట్ వేసినందుకు ఈడీ ఆఫీసు ముందు ధర్నా చేసి చట్టబద్దమైన వ్యవస్థను అవమాన పరిచిన నీచమైన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
గతంలో అయినా ప్రస్తుతం అయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కినంత మాత్రాన ప్రజలు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక విధానాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని స్పష్టం చేశారు.