భూత్పూర్, ఆగస్టు 11: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారిచ్చి తీరుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. పాలమూరుకు పర్యావరణ అనుమతులు రావడంతో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం భట్టుపల్లి సమీపంలోని ప్రాజెక్టు 13వ ప్యాకేజీ వద్ద నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కరివెన రిజర్వాయర్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో ఆర్డీఎస్ను బద్ధలుకొట్టి సాగునీటిని తీసుకుపోతున్నా నాటి మంత్రులు, ప్రజాప్రతినిధులు కండ్లప్పగించి చూశారని గుర్తుచేశారు. నేడు కేంద్రం పాలమూరు ప్రాజెక్టుపైన వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. అయినా, సీఎం కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో పోరాడి న్యాయస్థానంలో ప్రాజెక్టుకు అనుమతులను సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని మోదీ సర్కారు చెప్పినా నేటికీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఇది పండుగ రోజు: ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కొన్ని పార్టీల నాయకులు ప్రాజెక్టు పనులకు అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి పర్యావరణ అనుమతులు వచ్చేలా చేశారని ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు పండుగ రోజని అభివర్ణించారు.