మహబూబ్‌నగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ కార్యకర్తపై పెట్టిన అక్రమ కేసును ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు 18మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తను మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీసులు తాసీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన విషయం తెల్సిందే. మరుసటి రోజు స్టేషన్ ఎదుట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. దీనికి స్పందించిన వన్‌టౌన్ సీఐ అప్పయ్య.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇవ్వడంతో మాజీ మంత్రి ఆందోళన విరమించిన విషయం విదితమే. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ మెంబర్ రాజుసాగర్, వరద భాస్కర్, కిషన్, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, సత్యం యాదవ్, చిట్యాల సుధాకర్, శివరాజ్, పెట్రోల్ బంక్ రమేశ్, గణేశ్, రాము, నర్సింహులు, శరత్‌రెడ్డి, పాల సతీశ్, ఇమ్రాన్, జములయ్యపై అక్టోబర్ 30న సెక్షన్లు 132, 189 (2), 190, 192, 195 (1) 196, 292, 352 ప్రకారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని దీపావళి రోజు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మీడియాకు లీక్ చేశారు. విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం మహబూబ్‌నగర్‌కు చేరుకొని సంఘీభావం తెలిపారు. అనంతరం జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత శ్రీకాంత్‌గౌడ్‌ను కలిసి ధైర్యం చెప్పారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అక్రమంగా కేసులు నమోదు చేసిన ఘటనపై ఇటు కాంగ్రెస్ నేతలు ‘నీ తమ్ముడికి పట్టిన గతే నీకు పడుతుంది’ అని హెచ్చరికలు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏదోరకంగా శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
అక్రమంగా దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టిన విషయాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం కక్ష కట్టింది. అందులో భాగంగానే నా కుటుంబంపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి.
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే వారి కుటుంబంపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని శానసమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌పై పెట్టిన అక్రమ కేసును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నదని ఆరోపించారు. పాలనా వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ ముదిరాజ్‌ను బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.