Warangal MGM | వరంగల్ చౌరస్తా : ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితికి ఎంజీఎం ఘటన అద్దం పడుతుంది. వేర్వేరు సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు పారా మెడికల్, రేడియాలజీ సేవలు అందించడం కోసం తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇద్దరు పసి పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి, పరీక్షలకు తరలిస్తున్నారు. పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలించాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం దాయమ్మ లేదా పేషెంట్ కేర్ సిబ్బంది తరలించాల్సివున్న వార్డు బాధ్యులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం మూలంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.