ఎల్లారెడ్డి రూరల్, జూలై 9: కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి చైర్మన్గా ఎన్నికైన సత్యనారాయణ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా.. మే 18న ఆర్డీవో మన్నె ప్రభాకర్ మున్సిపల్ సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్కు చెందిన ఎనిమిది మంది, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సభ్యులు తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. చైర్మన్ సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లి అవిశ్వాసంపై ఫలితం ప్రకటించకుండా స్టే తెచ్చుకోవడం, అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ రోజు ఫలితం ప్రకటించలేదు. రెండ్రోజుల క్రితం హైకోర్టు స్టే ఎత్తేయడంతో ఆర్డీవో మంగళవారం ఫలితం ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిందని, చైర్మన్ సత్యనారాయణ పదవీచ్యుతుడయ్యారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడం చర్చనీయాంశమైంది.