హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : సన్న వడ్ల బోనస్‌కు సర్కారు మంగళం పాడిందా? యాసంగి ధాన్యం బోనస్ బకాయిలకు ఎగనామం పెట్టినట్టేనా? బోనస్ భారం తప్పించుకునేందుకే ప్రభుత్వం బకాయిల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నదా? తద్వారా రైతులు సర్కారుకు సన్నాలు విక్రయించకుండా వ్యూహం పన్నుతున్నదా? ఇవీ సన్నాల బోనస్ బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు. యాసంగిలో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ పైసలను ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించలేదు. దాదాపు మూడు నెలలవుతున్నా.. నయా పైసా విడుదల చేయలేదు. సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. యాసంగిలో మొత్తం 74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డు ధాన్యం 51 లక్షల టన్నులు, సన్నధాన్యం 23.19 లక్షల టన్నులు ఉన్నది. 4.09 లక్షల మంది రైతుల నుంచి ఈ సన్నాలను కొనుగోలు చేసింది.
ఆయా రైతులకు దాదాపు రూ.1,160 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నది. బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. ఒకవైపు వానకాలం పంటల సాగు కూడా పూర్తికావొస్తున్నది. మరో నెలన్నర రోజులైతే ముందే వేసిన వరినాట్లు కోతకు వస్తాయి. అయినప్పటికీ సర్కారు మాత్రం సన్నాయి బకాయిలను విడుదల చేయడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను మార్చి 20 నుంచి ప్రారంభించినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. దాదాపు జూన్ మొదటి వారం వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. సర్కారు కొనుగోలు చేసిన 23 లక్షల టన్నులకుపైగా సన్నాల్లో ఏప్రిల్ మూడో వారం నుంచి మే రెండో వారం వరకు అత్యధికభాగం కొనుగోలు చేసింది. రైతుల నుంచి సన్నాలు కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బోనస్ పైసలు జమ కావాలి. కానీ, మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు రైతులకు బోనస్ చెల్లించే ఆలోచన సర్కారు చేయకపోవడం గమనార్హం. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తుందో కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం.
ధాన్యం విక్రయించి మూడు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ బోనస్ పైసలు రాకపోవడంపై రైతులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. అసలు సర్కారు బకాయిలు ఇస్తదా? ఎగబెడతదా? అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మాట విని బోనస్‌కు ఆశపడి సన్నాలు సాగుచేస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, బోనస్ పైసలు ఆలస్యం కావడంతో వడ్డీల భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బోనస్‌తో పైసలు ఎక్కువ వస్తయని ఆశపడితే.. చివరకు నష్టపోయే పరిస్థతి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఇలా అయితే ఇక సన్నాలు సాగు చేసేందుకు రైతులెవరూ ముందుకురారంటూ నిట్టూర్చుతున్నారు. రెండు రోజుల్లోనే ధాన్యం పైసలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన సర్కారు.. మూడు నెలలైనా బోనస్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
సన్నాలు విక్రయించిన రైతులకు బకాయిపడ్డ సర్కారు… సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు కూడా బకాయిపడింది. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసిన సర్కారు ఇందుకు సంబంధించిన కమీషన్‌ను రేషన్ డీలర్లకు చెల్లించలేదు. ఏప్రిల్, మేతోపాటు జూన్‌లో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు బియ్యం కూడా పంపిణీ చేసింది. డీలర్లకు ఈ ఐదు నెలలకు సంబంధించి ప్రతి నెలా రూ.23 కోట్ల చొప్పున రూ.115 కోట్లు సర్కారు కమీషన్ చెల్లించాల్సి ఉన్నది. బియ్యం పంపిణీ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా కమీషన్ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అటు సన్నాలు విక్రయించిన రైతులకు బోనస్ బకాయిలు ఇవ్వకుండా.. ఇటు సన్న బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు కమీషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.