ఖలీల్‌వాడి, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ఇటీవల నూతన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంతో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో బుధవారం నగరంలో 10 వేల మందితో ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలిరావడంతో నగరమంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కులమతాలకతీతంగా అభివృద్ధి పరుగులు తీస్తున్నదని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. తాజాగా మంజూరైన రూ.100 కోట్ల నిధులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.