కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతును రోడ్డెక్కించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తిలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పేరుతో సర్కార్ రైతును నిలువునా ముంచిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి భంగపాటు తప్పదని హెచ్చరించారు. మాఫీపై ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ మంత్రు మాటలకు, లెక్కలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలుంటే.. కొద్ది మందికి మాత్రమే మాఫీచేసి గారడీ చేసిందని దుయ్యబట్టారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నా భార్య పేరు మీద ఉన్న భూమిపై అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబీలో రూ.1.15 లక్షల పంట రుణం తీసుకున్నాం. తరువాత ఆ భూమిని మా కొడుకు పేరు మీదికి బదలాయించాం. దీంతో సాగుభూమి లేకుండా రుణం ఉండకూదంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ ఏడాది మార్చిలో ఆ రుణం మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించాం. కానీ.. రుణం మొత్తం చెల్లించినట్టు క్లియరెన్స్ ఇవ్వలేదు.
అదే అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబీలో నా పేరు మీద ఉన్న రూ.1.68 లక్షల పంట రుణం మాఫీ కాలేదు. అధికారులను అడిగితే.. నీ భార్య పేరుతోనూ, నీ పేరుతోనూ కలిపి రూ.2 లక్షలపైగా రుణం ఉన్నందున కాలేదని చెప్పారు. నా భార్య పేరుతో ఉన్న క్రాప్ లోన్ మొత్తాన్ని మార్చిలోనే చెల్లించానని చెప్పడంతో బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించారు. నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చి అధికారులకు ఇవ్వడంతో రుణమాఫీ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
-పలగాని పుల్లయ్య, రైతు, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి, భద్రాద్రి జిల్లా