హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు. సీఎం స్థాయిలో ఉండి ఈ విషయం కూడా తెలువకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పులేదని, కానీ ప్రతీది తనకే తెలుసని అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఓ ప్రకటనలో విమర్శించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. రిజర్వేషన్లకు 50 శాతం క్యాప్ పెట్టింది సుప్రీంకోర్టు. ఇవి కేసీఆర్ చేసినవి కాదని రేవంత్‌రెడ్డికి తెలియదా? అవగాహన లేదా? రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారన్న విషయం సీఎంకు తెలియదా’ అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న రేవంత్ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాహుల్‌గాంధీని వెంటబెట్టుకొని మోదీని కలుస్తానంటూ రేవంత్ తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. 14 నెలలుగా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకని రేవంత్.. రాహుల్‌తో కలిసి మోదీని కలుస్తాననే ప్రచారం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు. 49 సార్లు రేవంత్ ఢిల్లీ పర్యటన కారణంగా రాష్ట్ర ఖజానాకు చిల్లు తప్పితే ఒక్క రూపాయీ రాష్ర్టానికి తెచ్చింది లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రచార యావ పతాకస్థాయికి చేరిందని, తెలంగాణ సమాజం అన్ని గమనిస్తున్నదని పేర్కొన్నారు.