హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress government) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టా రాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయానికి కేటీఆర్‌పై కేసు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చట్టాన్ని పోలీసులు గౌరవించడం లేదన్నారు.
విచారణ సంస్థలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షుద్ర రాజకీయ క్రీడ ఆడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఇచ్చే నజరానాలు, హోదాలు, తాయిలాలకు, ప్రలోభాలకు అధికారులు గురి కావొద్దన్నారు. చట్టబద్దంగా పోలీసులు వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.