హైదరాబాద్ : డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) పేరుతో ఏఈఓలను( AEOs) వేధించడం తగవు. సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్(Suspension) చేయడం దారుణమని మాజీ వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ (Niranjan Reddy) ఒక ప్రకటనలో ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్ర ఇచ్చే నిధుల ద్వారా సర్వే జరుగుతుంటే ఇక్కడ ఎందుకు ఏఈఓల నెత్తిన రుద్దుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేసేందుకు ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాం.
1500 కొత్త ఏఈఓల పోస్టులను సృష్టించి 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ లో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపు, అధిక దిగుబడి సాధించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఏఈఓల పాత్ర ఎనలేనిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త వారిని నియమించి సర్వే చేపట్టాలన్నారు.
ఏఈఓల విజ్ఞప్తి మేరకు డిజిటల్ క్రాప్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించడం, ఏజెన్సీలకు పనిని అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఏఈఓలలో అత్యధికులు మహిళలు ఉన్నారు. క్రాప్ సర్వే పేరుతో వారిని నిర్మానుష్య వ్యవసాయ కమతాలకు ఎలాంటి రక్షణ లేకుండా ఎలా పంపిస్తారని? వారి భద్రతకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వారు ఇప్పటికే 49 రకాల విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా వారి మీద బరువు ఎందుకు పెడుతున్నారు? ఔట్ సోర్సింగ్ మీద పనిచేస్తున్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం ఎంత వరకు సమంజసం ? ప్రజా పాలన అంటే బెదిరింపులేనా అని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్భంద పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.