గంగాధర, మార్చి 8: వ్యవసాయంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడం పూర్తి శ్రమతో కూడుకున్నది. దుక్కుల్లో చేతితో విత్తనాలు విత్తడం అనేది రైతులకు ఎక్కువ శ్రమ, కూలీలు, ఖర్చుతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విద్య పద్ధతి కూడా ఆర్థిక భారంతో కూడుకోవడంతోపాటు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. విత్తనాలు విత్తడం ఆలస్యం అయితే పంట దిగుబడి కూడా తగ్గుతుంది. సులభంగా, తక్కువ ఖర్చుతో, వేగంగా విత్తనాలు ఎత్తడానికి అనువుగా రైతుల కోసం సీడ్ విత్తే షూను (Seed Planting Shoes) కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మిట్టపల్లి రితిక తయారు చేసింది. ఉపాధ్యాయుడు జగదీశ్వర్ రెడ్డి మార్గదర్శకత్వంలో రితిక తయారుచేసిన సీడ్ విత్తే షూ ప్రాజెక్టు గత జనవరిలో జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించగా జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది.
ఎలా తయారు చేయాలి..
సీడ్ విత్తే షూను తయారు చేయడానికి షూ సైజులో ఉన్న ఐరన్ ప్లేట్‌ను తీసుకొవాలి. దాని వెనుక భాగం మధ్యలో రంధ్రం చేసి హాఫ్ ఇంచ్ పైపును అమర్చి, క్రింది భాగంలో పదునుగా ఉన్న నాజిల్ జాయింట్ చేయాలి. భుజానికి తగిలించే విత్తనాల సంచిని తీసుకొని దాని అడుగుభాగం నుంచి తీసుకున్న పైపును షూకు అమర్చిన ఐరన్ పైపుకు జత చేయాలి. రైతులు షూలో అడుగు పెట్టినప్పుడు ఇందులో ఏర్పాటు చేసిన లివర్‌పై ఒత్తిడి పడి అందులోని విత్తనాల చాంబర్ నుంచి విత్తనాన్ని విడుదల చేస్తుంది. కింది భాగంలో జాయింట్ చేసిన నాజిల్ మట్టిని డ్రిల్ చేసి, స్ప్రింగుల శక్తితో విత్తనాన్ని భూమిలోకి వదులుతుంది. మరో అటాచ్మెంట్, రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంద్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. విత్తనాలు విత్తడానికి అవసరమైన అన్ని యంత్రాలు షూలో అమర్చబడి ఉండడంతో సకాలంలో విత్తనాలను వదలడం, భూమిని డ్రిల్ చేయడం, మట్టిని కప్పడం అనేది శ్రమ లేకుండా సులభంగా జరుగుతుంది. మొక్కజొన్న, సోయాబీన్, ఆవాలు, పప్పు దినుసుల, వేరుశెనగ వంటి పంటలను వేయడానికి ఇది అనుకూలంగా ఉంటుందని రితిక తెలిపారు.
సీడ్ షూ ప్రయోజనాలు
సీడ్ విత్తే షూ కేవలం నడక ద్వారా పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమ, తక్కువ సమయం, తక్కువ కూలీలతో ఎక్కువ విస్తీర్ణంలో విత్తనాలు విత్తుకోవడం సాధ్యమవుతుంది. సులభమైన సాంకేతిక విధానంతో తయారుచేసిన షూ తో తక్కువ సమయంలో పని పూర్తి చేసుకోవచ్చు. యంత్రాలతో విత్తనాలు వెతుక్కోవడం ద్వారా ఖర్చు ఎక్కువ కావడంతో పాటు, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. షూ ద్వారా విత్తనాలను విత్తనం ద్వారా పెట్టుబడి ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. గ్రామాల్లో చిన్న సన్న కారు రైతులకు రితిక తయారుచేసిన సీడ్ విత్తే షూ ఎక్కువ సహకారిగా ఉంటుంది.
సులభ పద్ధతిలో విత్తనాలు వేసుకోవచ్చు: రితిక
రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్న సమయంలో వారు పడుతున్న శ్రమను చూశాను. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, ఎక్కువ విత్తనాలు వేసుకోవడానికి అనువుగా ఏదైనా ప్రయోగం చేయాలని ఆలోచన చేశాను. గైడ్ టీచర్ జగదీశ్వర్ రెడ్డి సార్ మార్గదర్శకత్వంలో సీడ్ విత్తే షూ తయారు చేశాను. నేను తయారుచేసిన ఈ యంత్రంతో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తనాలు విత్తుకోవచ్చు, పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. రైతులకు ఉపయోగపడే మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
జాతీయస్థాయికి ఎంపిక: జగదీశ్వర్ రెడ్డి
రైతులు సులభ పద్ధతిలో విత్తనాలు వేసుకునే విధంగా రితిక సీడ్ వితత్తే షూ ను తయారుచేసింది. యంత్రం ద్వారా రైతులకు శ్రమ, ఖర్చులు తగ్గడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ విత్తనాలు విత్తుక్కోవచ్చు. జడ్చర్లలో గత జనవరి 7,8,9వ తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనకు ప్రదర్శన పోటీల్లో రితిక తయారు చేసిన ప్రాజెక్టు అద్భుత ప్రదర్శన చేసి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది.