హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : వైద్య చరిత్రలో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహాయంతోనే చేయడం విశేషం. దేశంలోని అత్యధిక కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసే దవాఖానల వరుసన నిమ్స్ నిలవడం గమనార్హం. ఈ ప్రతిష్ఠాత్మకమైన మార్పిడి శస్త్ర చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందనే చేయడం మరో విశేషం. 1989లో నిమ్స్ ప్రారంభమైన నా టినుంచి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. 2015లో డాక్టర్ రామ్‌రెడ్డి విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పదేండ్లలో డాక్టర్ రామ్‌రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నేతృత్వంలో వెయ్యికిపైగా శస్త్ర చికిత్సలు నిర్వహించింది.
వందో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా డాక్టర్ రామ్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గత పదేండ్లుగా ఏటా 100కిపైగా ట్రాన్స్ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. గడిచిన రెండేండ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈఏడాది మాకు మరింత ప్ర త్యేకం. ఆరు నెలల్లోనే వందో కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేయగలిగాం’ అని తెలిపారు. డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ మాట్లాడుతూ.. ట్రాన్స్ప్లాంట్లను నిర్వహించిన తమ బృందం ప్రతినెలా వెయ్యికిపైగా యూరాలాజీ సంబంధిత శస్త్ర చికిత్సలు చేస్తున్నదని, ఏడాదికి 12వేలకు పైగా ప్రొసీజర్లు నిర్వహించారని, ఇరవై నాలుగు నెలల్లోనే 350కిపైగా రోబోటిక్ శస్త్ర చికిత్సలు పూర్తిచేశామని వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అధునాతన పరికరాలను తెప్పించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సైతం క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అందించేలా చర్యలు తీసుకున్నారు. నిమ్స్‌కు వచ్చేవారిలో 90% మంది పేదవారే కావడంతో వారికి ఉచితంగానే వైద్యసేవలు అందించేందుకు గత కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకున్నది. నిమ్స్‌లో పేదవారికి సైతం అధునాతన పరికరాలను ఉపయోగించి కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా కృషిచేసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వినూత్న ఆలోచనలు నేడు పేదలకు వరంగా మారాయి.