NIMS | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. తద్వారా దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ దవాఖానగా జాతీయ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిమ్స్ యూరాలజీ విభాగాన్ని అభినందించారు.
నిమ్స్ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో డాక్టర్ సీహెచ్ రాంరెడ్డి, డాక్టర్ ఎస్ విద్యాసాగర్, డాక్టర్ జీ రామచంద్రయ్య, డాక్టర్ జీవీ చరణ్‌కుమార్, డాక్టర్ ఎస్ఎస్ఎస్ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. అనస్థీషియా విభాగం డాక్టర్లు డాక్టర్ జే నిర్మల, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఇందిర, డాక్టర్ శిబాని, నెఫ్రాలజీ విభాగం వైద్యులు డాక్టర్ టీ గంగాధర్, డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ జీ స్వర్ణలత ఇందులో భాగస్వాములయ్యారు. సర్జరీ అనంతరం అందరూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ఫ్లాంట్ సెంటర్‌గా నిమ్స్
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యరంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రజా వైద్యానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న గాంధీ, నిమ్స్, ఉస్మానియా దవాఖానలకు అడిగినన్ని నిధులు, అత్యాధునిక వసతులు సమకూర్చారు. దీంతో నిమ్స్ దవాఖాన ఇప్పుడు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా రూపుదిద్దుకున్నది. అవయవ మార్పిడుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కేటాయిస్తున్నది. దీంతో రోగులకు పూర్తి ఉచితంగా అవయవ మార్పిడి చేయడమే కాకుండా వారికి జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది.
నిమ్స్ యూరాలజీ విభాగం ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించి జాతీయ రికార్డు సృష్టించింది. పేషంట్లందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సర్జరీల్లో భాగస్వాములైన వైద్యబృందానికి ప్రత్యేక అభినందనలు.
– ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
అవయవ మార్పిడులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేస్తుండటం గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. యూరాలజీతోపాటు నెఫ్రాలజీ, అనస్థీషియా తదితర విభాగాల సిబ్బంది అంకిత భావం వల్ల రికార్డు స్థాయి సర్జరీలు సాధ్యమవుతున్నాయి.
– రాహుల్ దేవరాజ్, హెచ్‌వోడీ, నిమ్స్ యూరాలజీ