హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో వేలాది పేదల ఇండ్లను కూల్చేయడంపై శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా ద్వారా వందలాది పేద, మధ్యతరగతి జీవితాలను రోడ్డున పడేయడంలో చొరవ చూపుతున్న ప్రభుత్వం.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే దవాఖానల నిర్మాణంపై మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నది. కూల్చడంపై ఉన్న ఆసక్తి నిర్మాణాలపై చూపకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణ పనులు ఆగిపోయాయి. చివరి దశకు వచ్చిన వరంగల్ హెల్త్‌సిటీ పనులపై ప్రభుత్వం పంతానికి పోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. పేదలకు ఉత్తమమైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడంతోపాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలపై ఒత్తిడి తగ్గించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా టిమ్స్ దవాఖానల నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో హెల్త్‌సిటీ పేరుతో భారీ దవాఖాన నిర్మాణం మొదలు పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఈ నాలుగు భవనాల నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థాంతరంగా పనులు నిలిపివేశారు. పనులకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందానికి, జరుగుతున్న నిర్మాణానికి పొంతన లేదనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం దవాఖానల పనులను నిలిపివేసింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతోపాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.350 కోట్లు బిల్లులు పెండింగులో పెట్టింది. వాస్తవానికి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించిన అనంతరం అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, మారుతున్న వైద్య విధానాలు, సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందులో ఏదో మతలబు జరిగిందనే అనుమానంతో పనులను నిలిపివేసిందని అంటున్నారు.
వాస్తవానికి వచ్చే ఏడాది మార్చినాటికే మూడు టిమ్స్ దవాఖానలను అందుబాటులోకి తేవాలని, అనంతరం ఉస్మానియా దవాఖాన పునర్నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మూడు కొత్త దవాఖానలు అందుబాటులోకి వస్తే ఉస్మానియా దవాఖాన నిర్మాణం పనులు చేపట్టినా పేదల వైద్య సేవలకు ఇబ్బంది ఉండదనేది గత ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇప్పుడు ప్రభుత్వం పనులు నిలిపివేయడంవల్ల వాటి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడంలేదు. మరోవైపు నిమ్స్ విస్తరణ పనులు కూడా నిలిచిపోయినట్టు సమాచారం.ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేవరకు పనులు ముందుకు సాగే అవకాశం లేదని ఆర్అండ్బీ శాఖ అధికారులు చెప్తున్నారు.
‘టిమ్స్’ జోరుకు బ్రేకులు
రాష్ట్రంలో ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ సేవలకు దశాబ్దాల క్రితం నిర్మించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానలే దిక్కు. రాష్ట్రంలోని పేదలే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర పొరుగు రాష్ర్టాల రోగులు కూడా ఆయా దవాఖానలకు వస్తుంటారు. దీంతో సామర్థ్యానికి మించి రోగులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి. సమయానికి వైద్యం అందక పేదలు నానా అవస్థలు పడుతున్నారు. వైద్యసిబ్బంది పనిభారంతో సతమతం అవుతున్నారు. ఈ ఇబ్బందులను దూరం చేయడంతోపాటు నగరానికి వచ్చే రోగులు ఎక్కడికక్కడే ఉత్తమ వైద్యసేవలు పొందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దవాఖానల నిర్మాణానికి సంకల్పించింది. అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో రూ.2,679 కోట్ల అంచనాతో ఈపీసీ (ఇంజినీరింగ్-ప్రొక్యూర్మెంట్-కన్స్ట్రక్షన్) పద్ధతిలో టిమ్స్ దవాఖానల నిర్మాణం చేపట్టింది. పనులు ప్రారంభం అయినప్పటి నుంచి పనులు వేగంగా సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి నిర్మాణాలు దాదాపు సగం పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను ఎక్కడిక్కడ నిలిపివేసింది. మరో ఏడాదిలో అందుబాటులోకి రావాల్సిన భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
పెరుగుతున్న నిర్మాణ వ్యయం
వరంగల్ హెల్త్సిటీతోపాటు మూడు టిమ్స్ దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.వందల కోట్లు వెచ్చించింది. పనులు సగం పూర్తయ్యాయి. ఇప్పుడు పనులు ఆలస్యం కావడంవల్ల నిర్మాణం వ్యయం పెరుగుతుందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వెంటనే పనులు తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తే డబ్బు ఆదా అవడంతోపాటు పేదలకు మేలు కలుగుతుందని చెప్తున్నారు. వరంగల్ హెల్త్‌సిటీ పనులను మొక్కుబడిగా పరిశీలిస్తున్నారే తప్ప, నిధులు మంజూరు చేయడం లేదని చెప్తున్నారు. ఇప్పటికప్పుడు పేదల గుడిసెలను కూల్చి, రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టులు కట్టేబదులు.. పేదలకు వైద్యం అందించే దవాఖానల నిర్మాణాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అనధికారికంగా డెంగీ కేసులు 10 వేలు దాటినట్టు చెప్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఫలితంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలు పూర్తయితే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయ ని నిపుణులు చెప్తున్నారు. ప్రభు త్వం పంతానికి పోకుండా పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులను గత కేసీఆర్ ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. 19 ఎకరాలు, 27 అంతస్తుల్లో నిర్మించే ఈ అత్యాధునిక దవాఖాన నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షిస్తున్నది. 1,200 పడకలను జనరల్ విభాగాలకు, 800 పడకలను ఆంకాలజీ, న్యూరాలజీ వంటి స్పెషాలిటీ విభాగాలకు కేటాయించారు. హైదరాబాద్‌లో నిమ్స్, గాంధీ, ఉస్మానియాకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను వరంగల్‌లో కూడా చేయాలని సంకల్పించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు హెలిప్యాడ్‌ను సైతం నిర్మించాలని నిర్ణయించారు. 2022 ఏప్రిల్‌లో ఎల్ అండ్ టీ సంస్థకు లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ సర్టిఫికెట్ అందజేశారు. అప్పటినుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దవాఖాన నిర్మాణ పనులు రాకెట్ వేగంతో సాగాయి. ప్రధాన భవనాల నిర్మాణం 80% పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు. నిరుడు దసరా నాటికే నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త హెల్త్‌సిటీ నిర్మాణ పనులు నిలిపివేసింది. ఎప్పు డో ఏడాది కిందటే పూర్తి కావాల్సిన పనులు.. ఇంకా ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి.
వీటిని కట్టడమా?
ఇది వరంగల్ హెల్త్‌సిటీలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన. కరోనా కాలంలో పేదల కష్టాలను గుర్తించిన కేసీఆర్ సర్కారు వారికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని తెలంగాణలో ఐదు మల్టీ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుటింది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 27 అంతస్థులతో హాస్పిటల్ నిర్మాణానికి 2021 జూన్ 21న కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెండు వేల పడకల సామర్థ్యంతో ఉత్తర తెలంగాణ ప్రజలకు సంజీవనిలాంటి ఈ దవాఖాన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 20 శాతం పనులు పూర్తి చేయడానికి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం వద్ద ‘నిధులు’ లేవట! పైగా దవాఖాన నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఈ దవాఖానతో పాటు, మిగతా ఏ టిమ్స్‌లోనూ తట్టెడు మట్టి ఎత్తలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన ఈ దవాఖానలు.. ఇంకా మొండి గోడలతోనే దర్శనమిస్తున్నయి.
వీటిని కూల్చడమా?
సున్నంచెరువులో హైడ్రా కూల్చివేసిన శిథిలాల మధ్యనే కాలం వెళ్లదీస్తున్నదీ వృద్ధురాలు యాదమ్మ. సుమారు రెండు నెలల క్రితం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేయడంతో.. ఎక్కడికి పోవాలో తెలియని నిర్వాసితులు అవే శిథిలాల మధ్య తాత్కాలిక టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. బయటకు పోదా మంటే కిరాయి 10 వేల నుంచి 15 వేల వరకు ఉందని వాపోతున్నారు. ఈ ఇండ్లకు కరెంట్ కూడా కట్ చేయడంతో అంధకారంలోనే మగ్గుతున్నారు. రాత్రయితే ఎప్పుడేం జరుగుతుందో.. ఒకవైపు పాములు, మరోవైపు దోమల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. శిథిలాల మధ్యే గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉండటంతో ఏ నిముషానికి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు.
మరేం చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం!
ఎక్కడా దిక్కులేక ఇలా పేదలు మూసీ తీరంలోనో, చెరువుల ఒడ్డునో చిన్న గుడిసె వేసుకుంటే, సుందరీకరణ పేరుతో వాటిని కూల్చేస్తున్నది. కేవలం 20- 30 శాతం పనులు చేస్తే నిర్మాణం పూర్తయి, పేదలకు అద్భుతమైన దవాఖానలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నా, వాటికి నిధుల కొరత, అప్పుల భారం సాకుగా చూపుతున్న రేవంత్ ప్రభుత్వం… లక్షన్నర కోట్లు అప్పుతెచ్చి, ఖర్చు పెట్టి, మూసీని సుందరీకరిస్తుందట. అందుకోసం ‘సామాన్లు తీస్కొంటమయ్యా జర ఉండున్రి’ అని అవ్వ బతిమిలాడినా.. ‘నా పలక లోపలున్నది’ అంటూ చిన్నోడు గుక్కపెట్టి ఏడ్చినా కనికరించకుండా ఇండ్ల కూల్చివేతకు దిగుతున్నది.
హెల్త్‌సిటీ.. రాకెట్ వేగంతో పనులు