హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో గల్లంతైన కార్మికులను తొమ్మిది నెలలు అవుతున్నా కనుగొనలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హకుల కమిషన్ (NHRC) సీరియస్ అయింది. అత్యవసర చర్యలు చేపట్టి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో తవ్వకాలు జరుపుతున్న కార్మికులపై కప్పు పైభాగం కూలడంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు.
ఇందులో ఇప్పటివరకు మనోజ్‌కుమార్, గురుప్రీత్‌సింగ్ మృతదేహాలు వెలికితీశారు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్, జమ్ముకశ్మీర్‌కు చెందిన సన్నీసింగ్, జార్ఖండ్‌కు చెందిన సందీప్‌సాహు, జగ్తా, సంతోష్‌సాహు, అనూజ్సాహు ఆచూకీని ఇప్పటికీ గుర్తించకపోవడంపై కమిషన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల నియంత్రణ, పని పరిస్థితుల చట్టాలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడింది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి గల్లంతైనవారిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమగ్ర నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఎస్‌కు ఆదేశాలు జారీచేసింది.