హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏడాది నవంబర్ 25న మృతి చెందింది. ఈ ఘటనలో 60 మంది విద్యార్థినులు కలుషిత ఆహారంతో అనారోగ్యానికి గురయ్యారు. తెలంగాణ బిడ్డలు విష ఆహారంతో మృత్యువాతకు గురవుతున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తులు, వినతిపత్రాలు చేసినా పట్టించుకోలేదు.
దీంతో కలుషిత ఆహార ఘటనలపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వరుస కథనాలు ప్రచురించాయి. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు సైతం చేశాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలను నిగ్గు తేల్చాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు గతంలో ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా 318/36/19/2025తో ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. ఆ ఘటనపై విచారణ చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింది.