హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత నెల ఒక పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో హైదరాబాద్కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేయడం జరిగింది.
రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్.. మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదికను సమర్పించాలని డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.