హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్రవిచిత్రాలు, వింత విధానాలు ఒకటి తర్వాత మరొకటి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సంబంధించిన మరో వ్యవహారం, మరోసారి బయటపడింది. ఆయన సినిమాటోగ్రఫీశాఖ మంత్రి. కొత్త సినిమాల విడుదలప్పుడు టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి వంటివి ఎవరికైనా అవసరమైతే ఆయననే సంప్రదించాలి.
కానీ ఆయనకు తెలియకుండానే ఇటీవల పలు చిత్రాలకు టికెట్ల రేట్లు పెరిగాయి. బెనిఫిట్ షోలకు అనుమతి కోసం తెరవెనుక చాలా సిత్రాలు ఉన్నాయని, టికెట్ రేట్ల పెంపునకు సెపరేటు ఫార్మాలిటీస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సం బంధితశాఖ మంత్రిగా తనకు తెలియకుండానే కొందరు పని కానివ్వడంపై కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారు.
సినిమాలకు టికెట్ల రేట్ల పెంపునకు ప్రత్యేక అనుమతి ఇచ్చే ప్రసక్తేలేదని డిసెంబర్ 12న మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. నెల గడువకముందే శుక్రవారం విడుదలైన ‘రాజాసాబ్’ కు అర్ధరాత్రి టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో తనకు.. తన మాటకు విలువ లేదంటూ కోమటిరెడ్డి సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. సినిమావాళ్లకు, ముఖ్యనేతకు మధ్యవర్తిగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నాయకుడు మంత్రాంగం నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.