హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆయా చోట్ల కొత్త పాలకవర్గాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఎస్ఈసీ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇదే నెల 21 లేదా 22 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల కావచ్చని తెలుస్తున్నది. ఆ రోజు నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎస్ఈసీ ఎన్నికలకు వెళ్తున్నది. ఎస్ఈసీ అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి 20లోపు పురపాలికల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయని తెలుస్తున్నది.
మున్సిపల్ ఎన్నికలను త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం హడావుడి చేస్తున్నాయి. విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభానికి ముందే ప్రక్రియను ముగించాలని చూస్తున్నాయి. ఈ హడావుడిలో అనేక పొరపాట్లు, ఓటరు జాబితాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఓటరు జాబితాలు తప్పుల తడకగా ఉన్నట్టు ఇప్పటికే అనేక జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కో కుటుం బం ఓట్లు వేర్వేరు చోట్ల ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చా యి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పూర్తి కావాల్సిన తుది ఓటరు జాబితా ప్రకటన.. 12న ప్రచురించేలా అవకాశం కల్పించాలని ఇటీవల ఎస్ఈసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల ఎన్నికల అధికారులు కోరినట్టు తెలిసింది. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈసీ.. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలోని 6 మున్సిపల్ కార్పొరేషన్లలోని 366 వార్డులు, 117 మున్సిపాలిటీల పరిధిలోని 2,630 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురించాలని కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు ఈనెల 16న అధికారికంగా ప్రచురించాలని చెప్పారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన మరుసటి రోజు షెడ్యూల్ ఇవ్వాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు తెలిసింది.