వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు, నెలకు పింఛన్ రూ.4వేలకు ఇస్తామని చెప్పడంతో వేలాదిమంది ఎంతోఆశగా ఎదురుచూశారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్‌దారులను చేర్చకపోవడంతోపాటు, నెలకు రూ.4వేల హామీ అటకెక్కించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలవారీ ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2022 ఆగస్టులో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఆ తరువాత ప్రజా ప్రభుత్వం పేరిట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్కరిని కూడా ఆసరా పథకంలో చేర్చలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజాపాలన కార్యక్రమంలోనూ లక్షలాది దరఖాస్తులు ఆసరా పింఛన్ల కోసం వచ్చినా.. వాటిని తూతూ మంత్రంగా స్వీకరించడం తప్పితే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దాదాపు లక్ష మంది ఆసరా పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, హెచ్ఐవీ బాధితులు, డయా లసిస్ పేషెంట్లు, వృద్ధ కళాకారులకు ప్రతినెలా ఆసరా పథకం ద్వారా పింఛన్ ఇచ్చి వారికి కొండంత అండగా నిలిచింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 క్యాటగిరీలలోని 39.41 లక్షలమంది ఆసరా లబ్ధిదా రులు ఉండగా, దివ్యాంగులకు నెలకు రూ.4,016, వృద్ధ కళాకారులకు రూ.3,016, మిగిలిన తొమ్మిది వర్గాల వారికి రూ.2,016 చొప్పున పింఛన్లు ఇచ్చి ఆదుకున్నది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికీ పింఛన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. నిబంధనల ప్రకారం వృద్ధాప్య పింఛన్ 65 ఏండ్లు దాటిన పేదలకు, 50ఏండ్లు దాటిన చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులకు వారికి ఆసరా పింఛన్ ఇవ్వాలి. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితుల ఇంతే మొత్తాన్ని ఇవ్వాలి. కానీ కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కారు నిధుల లేమి కారణంగా చూపుతూ కొత్తగా ఆసరా పథకంలో లబ్ధిదారులను చేర్చడం లేదు.