CM KCR | ‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్‌పూర్ పర్యటనపై సోషల్‌మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్రతిబింబించింది. సైద్ధాంతిక భావజాలాల సంఘర్షణ గడ్డ నాగ్‌పూర్. అటు హిందూత్వ భావజాలానికి, ఇటు దళిత – బహుజన అస్తిత్వవాదానికి అదే పురిటిగడ్డ. ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ మాత్రమే కాదు.. అంబేద్కర్ దీక్షాభూమి కూడా నాగ్‌పూరే. అలాంటి చారిత్రక నగరంలో కేసీఆర్ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. దేశ పరివర్తన కోసం నూతన పంథాను, ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి.. తన లక్ష్యాన్ని సాధించి, రాష్ర్టాల ఏర్పాటు మీద సాధికారికంగా సమాధానాలిచ్చే స్థాయికి ఎదగడం అరుదైన విషయం. ప్రాంతీయ అస్థిత్వం కోసం సతమతమవుతున్న ప్రాంతాలకు ఒక జాతీయ నేతగా కేసీఆర్ కొత్తదారి చూపారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): దేశం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలను రూపుమాపే విజన్‌ను ప్రకటించే స్థాయికి తెలంగాణ నాయకత్వం ఎదగడం చారిత్రక సందర్భం. తెలంగాణ మాడల్ వినా దేశానికి మరో మార్గం లేదని, అన్ని ఇజాలకు విరుగుడు వికాసమేనని నాగ్‌పూర్ కేంద్రంగా కేసీఆర్ కుండబద్దలు కొట్టడం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నది. ఇవ్వాళ తెలంగాణ ఆచరిస్తున్నది.. రేపు దేశం అనుసరించక తప్పదని కేసీఆర్ నాగ్‌పూర్ పర్యటన తేల్చిచెప్పింది. అనేక భావజాలాల సంఘర్షణ నగరి నాగ్‌పూర్. హిందూత్వ సనాతన, మనువాద భావజాల వ్యాప్తి కోసం ఆర్ఎస్ఎస్ను కన్నగడ్డ నాగ్‌పూర్. దళిత,బహుజనవాద విముక్తి కోసం పోరాడిన గడ్డకూడా నాగ్‌పూరే. మనుస్మృతి ప్రతులను దగ్ధంచేసిన దీక్షాభూమి.. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ మంత్రాన్ని పఠించి ఆచరించిన నేల కూడా. బహుజనవర్గ విముక్తికి దిక్సూచిలా నిలిచిన మహాత్మా జ్యోతిరావుఫూలే, స్త్రీవిద్యకు చుక్కానిలా నిలిచిన సావిత్రిబాయి స్థావరమూ నాగ్‌పూరే.
మొత్తంగా భారతావనికి భిన్నమార్గాల సైద్ధాంతిక ప్రాతిపదికను అందించిన నాగ్‌పూర్ నుంచి గురువారం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశపరివర్తన కోసం నగారా మోగించారు. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు విముక్తి కోసం దేశపు నడిగడ్డ మీది నుంచి కేసీఆర్ పిలుపునిచ్చారు. తరతరాలుగా దళిత జాతి ఎదుర్కొంటున్న అంటరానితనం విముక్తి కోసం, సామాజిక సమానత్వం దిశగా ప్రణాళికను ప్రతిపాదించారు. బహుజన వర్గాల బాగు కోసం, మహిళా సమాజోద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలను ప్రస్తావించారు. చారిత్రక సందర్భంలో బుద్ధిజీవులు మేల్కొనకపోతే సమాజం వారిని చరిత్రహీనులుగా చూస్తుందంటూ బాధ్యతాయుత పాలకుడిగా కేసీఆర్ చేసిన ప్రబోధాన్ని జనవాహిని అంతే శ్రద్ధగా విన్నది. నాగ్‌పూర్ లాంటి చారిత్రక.. సాంస్కృతిక, వారసత్వ సైద్ధాంతిక క్షేత్రంలో కేసీఆర్ లాంటి నాయకుడు చేసిన ప్రసంగం.. ఇచ్చిన సందేశం.. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రవచన ప్రతీకలను బద్దలు కొట్టిన తెలంగాణ
దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి స్వాతంత్య్రానంతం దాదాపు మూడు, నాలుగు దశాబ్దాలపాటు.. ‘బెంగాల్ ఏమి ఆలోచిస్తుందో.. భారత్ దాన్ని అనుసరిస్తుంది’ అనే నానుడి జనబాహుళ్యంలోకి వ్యాప్తిచెందింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా.. ప్రత్యేకించి మోదీ ప్రధాని అయిన ఈ 9 ఏండ్లుగా.. ‘నాగ్‌పూర్ నిర్దేశిస్తుంది.. బీజేపీ ఆచరిస్తుంది’ అనేది ప్రచారంలోకి వచ్చింది. ఇటువంటి ప్రవచన ప్రతీకలను కేసీఆర్ బద్ధలు కొట్టారు. రాజకీయ మార్పులకు, అస్థిత్వ పోరాటాలకు, సైద్ధాంతిక సంఘర్షణలకు.. ఇప్పుడు ప్రగతి బాటలకు తెలంగాణ ప్రయోగశాలగా నిలిచింది. కమ్యూనిజం మొదలుకొని అనేక సామాజిక ఉద్యమాలకు తెలంగాణ వేదికగా నిలిచింది. 60-70 ఏండ్లుగా తండ్లాడిన నేల.. ఇవ్వాళ దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది.
ఇది చారిత్రక సందర్భం..
కొడితే ఏనుగు కుంభస్థలాన్నేకొట్టాలి. బీజేపీ విర్రవీగే స్థలం నుంచే జైత్రయాత్రను ప్రారంభించాలని
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించుకొని అందుకు అనుగుణమైన కార్యాచరణను వెల్లడించటం సాహసోపేత చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురేలేదనే వాతావరణం నెలకొన్న సందర్భంలో దేశ పరివర్తన కోసం.. గుణాత్మక మార్పు సాధన కోసం సీఎం కేసీఆర్ సంకల్పించిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగం పార్టీ సొంత కార్యాలయాన్ని నాగపూర్‌లో ప్రారంభించిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆసక్తిగా విన్న నాగ్‌పూర్
నాగపూర్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంతో అక్కడి సురేష్‌భట్ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ఆడిటోరియమే కాదు.. యావత్తు నాగపూర్ నగరం గులాబీమయమైంది. 2,500 మంది కూర్చునేందుకు సీట్లు ఉండగా.. నిర్వాహకులు అనుకున్నదానికి కంటే రెట్టింపు ప్రజాస్పందన కనిపించింది. ఆడిటోయంలో కాలుపెట్ట సందులేనంతగా ప్రజలు, కార్యకర్తలు, రైతులు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుండిపోయారు. ఆడిటోరియం గ్యాలరీ కూడానిండిపోయింది. వందలాదిమంది ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూర్చున్నారు. లోపలికి రాలేకపోయినవారు పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం ఓపిగ్గా విన్నారు. నిజానికి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుందని నిర్వాహకులు మొదట ప్రకటించారు.
మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, నాగపూర్ పురప్రముఖులు నిర్దేశిత సమయానికి కన్నా గంట ముందే ఆడిటోరియం చేరుకున్నారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఆడిటోరియం ప్రాంగణానికి చేరుకునే వరకు దాదాపు 3 గంటలపాటు కూర్చున్నవారెవరూ కదల్లేదు. సీఎం కేసీఆర్ సమావేశ మందిరానికి చేరుకోగానే ఒక్కసారిగా ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’, ‘దేశ్‌కీ నేత కైసేహో.. కేసీఆర్ జైసేహో’ అన్న నినాదాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంగ్డే, పార్టీ సీనియర్ నేత చరణ్ వాగ్మారే తదితరుల సందేశాలు పూర్తయిన తరువాత సీఎం కేసీఆర్ సమావేశ మందిరంలో ఆసీనులైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలపాటు మహారాష్ట్ర, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను.. వాటిని అధిగమించేందుకు తన వద్ద ఉన్న ప్రత్యామ్నాయ, ఆచరణీయ మార్గాలను కేసీఆర్ వివరించి చెప్తుంటే.. ప్రతీ సందర్భంలో నాగపూర్ ప్రతిస్పందించింది. కేసీఆర్ చెప్తున్న అంశాలను శ్రద్ధగా ఆలకించింది. దేశ పరివర్తన కోసం కేసీఆర్ చూపుతున్న మార్గం ఆచరణ సాధ్యమేనన్న నమ్మకం అక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపించింది.
సీఎం కేసీఆర్ నాయత్వంలో 9 ఏండ్లుగా సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమహారంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ నాగ్‌పూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, విద్యుత్ విజయం, కల్యాణలక్ష్మి/ షాదీముబాకర్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, టీ-హబ్, ఐఎస్-ఐపాస్ డబుల్ బెడ్రూం, హైదరాబాద్ మహానగర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మరాఠీ భాషలో రూపొందించిన డాక్యుమెంటరీని అనేక పర్యాయాలు ప్రదర్శించినా.. అంతే శ్రద్ధగా విన్నారు. భారత్ ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం ఈ దేశహితానికి ఏమాత్రం సరిపడదంటూ కేసీఆర్ నాగపూర్ కేంద్రంగా ఇచ్చిన సందేశం చరిత్రాత్మకం. చరితార్థం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.