Congress Govt | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ధాన్యం, పత్తి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పత్తి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తేమ సాకుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాంటా పెట్టే దిక్కు లేకుండా పోయింది. దీంతో రైతులు ఆయా పంటలను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కక, ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేయక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కడుపు మండిన రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు.
పేరుకే కొనుగోలు కేంద్రాలు
రాష్ట్రంలో 4,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, మెజార్టీ కేంద్రాల్లో గింజ ధాన్యం కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కొనుగోళ్లు ప్రారంభించి నెల గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం లక్ష టన్నులు కూడా కొనుగోలు చేయలేదని సమాచారం. సీసీఐ కొనుగోలు కేంద్రాల విషయంలోనూ ఇదే పరిస్థితి. అక్కడ పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను తిప్పి పంపిస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. దొడ్డు ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320 ఉండగా మొన్నటివరకు ప్రైవేట్ మార్కెట్ల్లో రూ.1,900 వరకు ధర దక్కింది.
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ఈ లెక్కన క్వింటాలుకు రూ.400 చొప్పున రైతులు నష్టపోయారు. పత్తి పరిస్థితీ అంతే. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.6,500కు మించి చెల్లించడం లేదు. దీంతో పత్తి రైతులు క్వింటాల్‌కు రూ.వెయ్యి వరకు నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రైవేటు మార్కెట్లో ఈ రెండు పంటల ధరలు మరింత పడిపోయాయి. ఈ నేపథ్యంలో మద్దతు ధర దక్కకపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. రోడ్లపై ధాన్యం పారబోసి నిరసన వ్యక్తంచేస్తున్నారు. పత్తి రైతులు సైతం రోడ్లపై పత్తిని పారబోసి ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కొనుగోళ్లను ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వం?
ప్రస్తుత సీజన్లో ధాన్యం, పత్తి కొనుగోళ్ల తీరు గమనిస్తే, పంటల కొనుగోళ్ల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటు వ్యాపారులకు అప్పగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల కంటే, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు సుమారు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అంచనాలున్నాయి. పత్తి ఉత్పత్తి దాదాపు 25 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు సీసీఐ 500 టన్నుల వరకు మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే మొదటి కటింగ్ పూర్తికావొచ్చింది.
ఇందులో మెజార్టీ భాగంగా ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం పంటల కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్న ధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,320కి అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై భారీ మొత్తంలో ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. అందుకే కొనుగోళ్లను కాస్త ఆలస్యం చేస్తే రైతులు ప్రైవేటుకు విక్రయిస్తారనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బతుకమ్మ తెల్లారి పోసిన
నేను ఎకరం పొలమేసిన 40 క్వింటాళ్లు వచ్చినయ్. ఇంకో 20 గుంటలల్ల సన్నపు వడ్లు పెట్టిన. అవ్వి కల్లంలకు తేలేదు. ఇది వరకు కొన్నట్టే కొంటరని బతుకమ్మ పండుగ తెల్లారి కల్లంల పోసిన. వర్షమచ్చిన ప్రతిసారి ఎత్తుడు, నేర్పుడు, ఇబ్బంది అయితుంది. ఎంతగానం గీ వడ్లకు కావలుండుడు. ఇంక మేం అమ్ముకోలే. ఈడ కావలుండుడు శాన ఇబ్బందైతున్నది.
– నెత్తెట్ల మల్లయ్య, రాగట్లపల్లి, ఎల్లారెడ్డిపేట