Inter Exams | హైదరాబాద్, మార్చి 6 ( నమస్తే తెలంగాణ ) : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతివాచీలు అనుమతించని అధికారులు పరీక్ష సెంటర్లలో కనీసం వాల్‌క్లాక్‌లు ఏర్పాటుచేయలేదు. ప్రతి అరగంటకు బెల్ మోగించాల్సి ఉన్నప్పటికీ చాలా సెంటర్లలో గంట మోగడం లేదు. దీంతో విద్యార్థులు సమయం కోసం పదేపదే ఇన్విజిలేటర్లను అడగాల్సి వస్తున్నది. అనేక సెంటర్లలో పరీక్షలు రాసేందుకు సరిపడా బెంచీలు, డెస్క్‌లు ఏర్పాటుచేయలేదు. మరోవైపు పరీక్ష ఫ్యాడ్లను అనుమతించలేదు. మరుగుదొడ్ల వసతి, తాగునీటి సౌకర్యం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా ఇంటర్‌బోర్డు అలసత్వం వీడి తగిన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్-2 పరీక్షకు 97.60 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు బోర్డు సెక్రటరీ తెలిపారు. 4,52,028 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 4,40,513 మంది హాజరయ్యారు. 10,823 మంది (2.39 శాతం) గైర్హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు.