హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రలోభాల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ (Naveen Yadav), అతడి అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమదైన ‘మార్క్’ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. బస్తీల్లో డబ్బులు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను ఈసీకి సమర్పిస్తున్నారు. పోలీసులకు సమాచారమిస్తున్నారు. అయినా ఈసీ గానీ, పోలీసులు గానీ.. కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలేదు. చూసీ చూడనట్టు వ్యవహరించాలని ‘పైనుంచి’ ఆర్డర్స్ ఉన్నాయని కొందరు పోలీసు అధికారులు విశ్వసనీయంగా చెప్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు నడిబజారులో డబ్బులు పంపిణీ చేస్తూ కనిపిస్తున్నా పట్టించుకోని ఈసీ అధికారులు, పోలీసులు.. బీఆర్ఎస్ నేతల ఇండ్లలోకి చొరబడి మరీ మూలమూల వెతుకుతున్నారు. శుక్రవారం మోతీనగర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లోకి పెద్ద సంఖ్యలో దూసుకెళ్లిన పోలీసులు గంటల తరబడి హడావుడి చేశారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావును వేధింపులకు గురిచేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే తనిఖీలు చేశారు. ఇంత హడావుడి చేసిన అధికారులంతా.. అక్కడ బట్టలు తప్ప ఏమీ లేవని గుర్తించారు. ఎందుకు ఇంత హడావుడి చేశారని అంటే.. డబ్బులు ఉన్నాయని తమకు ఎవరో సమాచారం ఇచ్చారని ఈసీ అధికారులు, పోలీసులు తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేశారంటే.. ఎవరో మౌఖికంగా చెప్పారని దాటవేశారు. ఆకాశరామన్నల సమాచారంతో రెచ్చిపోయే అధికారులు… డబ్బుల పంపిణీకి పక్కా ఆధారాలున్న ఘటనలపై తీసుకున్న చర్యలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట… కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచే వ్యవహారం తెరపైకి వస్తూనే ఉన్నది. శుక్రవారం రోజునే ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్ కాలనీలో డబ్బులు పెద్ద ఎత్తున ఉన్నట్టు ప్రచారం జరగడంతో శుక్రవారం ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. మీడియాను, ఇతర పార్టీ నేతలను లోపలికి రానీయకుండా లోలోపల తనిఖీలు చేశారు. కానీ ఆ రోజురాత్రే జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో కాంగ్రెస్ నేత సీఎన్‌రెడ్డి ఇంట్లో మంత్రి సీతక్కతోపాటు డివిజన్ నేతలంతా సమావేశమయ్యారు. అక్కడ డబ్బులు పంచుతున్నారంటూ మీడియాలో, బయట పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొందరు నేతలు డబ్బుల సంచులతో బయటకు వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం బోరబండలో కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచే వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కానీ ఎన్నికల సంఘం అధికారులు కిక్కురుమనలేదు. ఆదివారం లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జూబ్లీహిల్స్ హోటల్స్ కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు కొన్నిచోట్ల డబ్బుల పంపిణీ చేసే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రహమత్‌నగర్‌లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దర్పిల్లి రాజశేఖర్‌రెడ్డి బహిరంగంగానే డబ్బులు పంచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంటివద్ద భారీగా నగదు పంపిణీ చేసినట్టుగా వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన ఇంటివద్ద పైసలు ఇస్తున్నారని ప్రచారం కావడంతోపాటు స్థానిక నేతలు కొందరు తమ ప్రాంత ప్రజలను అక్కడికి తరలించినట్టు తెలిసింది. ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ స్థానిక నేతలు ఓటర్ల ఇండ్లకు వెళ్లి, డబ్బులు, చీరలు పంచారు. ఎర్రగడ్డలో హోటల్ పాలక్‌లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుంటే పోలీసులకు సమాచారం అందింది. దీంతో 11 మంది చోటా నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అప్పటికే డబ్బుల పంపిణీ పూర్తయినట్టు సమాచారం. ఓటమి భయంతో కాంగ్రెస్ చేస్తున్న ప్రలోభాలపై ఎన్నికల సంఘం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తున్నదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్పై వేధింపులకు పాల్పడుతూ… కాంగ్రెస్‌పై తూతూమంత్రం చర్యలు తీసుకోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్కారు పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బుల పంపిణీకి తెరతీశారు. ఓటమి భయంతో చివరి అస్త్రంగా ప్రజలకు డబ్బులు ఎర చూపుతున్నారు. ఓటుకు 2,500 నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఓటరు జాబితాలో చూస్తూ డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు… బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నవీన్‌యాదవ్ ఇంటి వద్ద కూడా పెద్దఎత్తున ప్రజలు గుమిగూడిన వీడియోలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడ డబ్బులు, బహుమతులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలేదు. కాంగ్రెస్ నేతల కదలికలపై కనీస నిఘా కూడా లేదు.