Bathukamma | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ కళతప్పింది. ఊరూరా కొండంత అన్నంతగా జరుపుకునే ఈ పండుగ నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే సర్కారు పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. పండుగ ఏర్పాట్లకు కనీస ఏర్పాట్లు చేయకపోగా, ఆడబిడ్డలకు ప్రభుత్వం ఇచ్చే చీర కానుకను సర్కారు ఎగ్గొట్టింది. సద్దుల బతుమ్మకు కోసమైనా ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా చేస్తుందని భావించినా అదీ ఎండమావే అయింది. సీఎం రేవంత్రెడ్డి, సంబంధిత మంత్రి పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. సీఎస్ సమీక్ష నిర్వహించారని చెప్తున్నా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనేలేదు. బతుకమ్మ ఏర్పాట్లకోసం ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు జారీకాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెప్తుండటమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహా భాగస్వామ్య శాఖలు సకల ఏర్పాట్లు చేయాలని గతంలో వారం రోజుల ముందే ఏటా సీఎం ఆదేశాలు జారీ చేసేవారు. పండుగ నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేసే సంప్రదాయం ఉండేది. పండుగ మొదలై సద్దుల బతుకమ్మ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ‘బేబీ పాండ్స్’ (చిన్న నీటివనరులు)ను నేటికీ తొలగించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు.
ఒకవైపు ప్రభుత్వం ఏర్పాట్టు చేయకపోగా, మరోవైపు ఆడిపాడే మహిళలకు రాష్ట్రంలోని పలుచోట్ల ఆటంకాలే ఎదురవుతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో బతుకమ్మ ఆడేందుకు వెళ్లిన ఆడబిడ్డలను అవమానపరిచారు. మంత్రి సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలం పెద్దంపల్లి గ్రామంలో, భూపాలపల్లి జిల్లాలోని పలుచోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించని ఘటనలు వెలుగు చూశాయి. ఈ కారణంగా సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఏటా అక్టోబర్ మొదటివారంలో బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ మార్ కే రాబిన్సన్ కార్యాలయం ప్రకటించింది. ‘తెలంగాణలో ప్రధానంగా జరుపుకొనే ఈ పండుగ అక్కడి ప్రజల సాంస్కృతిక వారసత్వం, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి నార్త్ కరోలినాకు వచ్చిన ప్రజలు ఈ పండగను ఉమ్మడి జరుపుకోవచ్చని గవర్నర్ తెలిపారు.