NEET | న్యూఢిల్లీ, జూన్ 8: నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశించడానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- యూజీ 2024 నిర్వహణలో అక్రమాలు జరిగాయని విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే 67 మంది అభ్యర్థులు వంద శాతం మార్కులతో మొదటి ర్యాంక్ పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుబోధ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ పరీక్షకు సంబంధించి కేవలం ఆరు పరీక్షా కేంద్రాల్లోనే సమస్యలు తలెత్తినట్టు నిర్ణారణ అయ్యిందని చెప్పారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కుల గురించి సమీక్షిస్తున్నామని, అనుమానాస్పదంగా ఉన్న 1500 మంది విద్యార్థుల మార్కులను పునః పరిశీలించడానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దాని నివేదిక అనంతరం తగిన చర్య తీసుకుంటామన్నారు.అయితే నీట్ ప్రవేశాల ప్రక్రియపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.
నీట్ నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల మార్పు, గ్రేస్ మార్కులు, కొన్ని సెంటర్లలో తక్కువ సమయం కేటాయింపు వంటివి సమస్యలుగా గుర్తించామన్నారు. తాము అన్ని అంశాలను పారదర్శకంగా పరిళీలించిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడించామన్నారు. నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం కలగ లేదని, దానిని కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద పోటీ పరీక్ష అయిన నీట్‌ను 4,750 కేంద్రాల్లో నిర్వహించగా, 24 లక్షల మంది హాజరయ్యారని, అయితే ఆరు కేంద్రాల్లో ప్రశ్న పత్రాలను తప్పుగా పంచడం వల్ల 16 వేల మంది విద్యార్థులపై దీని ప్రభావం పడిందన్నారు. తమకు పరీక్షల్లో తక్కువ సమయం కేటాయించారని ఆరోపిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనిపై నిపుణుల కమిటీని వేసి వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయా సెంటర్ల నుంచి వచ్చిన నివేదికలతో పాటు సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి నిజాలు నిర్ధారిస్తామని చెప్పారు.
నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు ఎన్టీఏకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు సహా, పలు హైకోర్టులను ఆశ్రయించారు. అలాగే పలు కోచింగ్ సెంటర్లు సైతం కేసులు దాఖలు చేశాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టుకెక్కే యోచనలో ఉంది. కాగా, నీట్లో అక్రమాలు జరిగాయని, వాటి ఫలితాల వెల్లడిపై స్టే విధించాలంటూ మే 17న దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
నీట్లో 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం, ఇతర ఆరోపణలను సమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శనివారం ప్రకటించింది. యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ వారం రోజుల్లో దీనిపై తన నివేదికను అందజేస్తుంది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు సంబంధిత విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేది లేనిదీ నిర్ణయిస్తామని ఎన్టీఏ డీజీ తెలిపారు.
నీట్ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత జాస్మిన్ షా డిమాండ్ చేశారు. నీట్లో అవకతకల కారణంగా తమ రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. నీట్ పరీక్ష అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఐఎంఏ జూనియర్ డాక్టర్ల నెట్వర్క్ డిమాండ్ చేసింది.
జగిత్యాల, జూన్ 8: గత నెలలో నిర్వహించిన నీట్ -2024 పరీక్షను తిరిగి నిర్వహించాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ కటాఫ్, నెగెటివ్ మారులకు భిన్నంగా నీట్ ఫలితాలు ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని, పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, నీట్ 2024ను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్‌కు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. నీట్ ఫలితాలను ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఎన్డీయే సరార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదురోవాల్సి వస్తుందన్నారు.