యాదగిరిగుట్ట, జూన్ 20 : నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం నిర్వహించిన దళిత హక్కుల పోరాట సమితి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హర్యానలో ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులు, బీహార్లో రూ.30 లక్షలకు ప్రశ్నపత్రం అమ్ముకుంటున్నట్టు బయటపడిందని అన్నారు. నీట్ పరీక్ష అవినీతిమయంగా మారిందని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాద, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. రూ.7లక్షల కోట్ల అప్పు ఉన్నదని, ప్రాజెక్టులు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు చర్చపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాపాలనలో 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. 2 లక్షల రుణమాఫీ హామీని వెంటనే నెరవేర్చాలని, అవినీతి రహిత పాలన అందించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు. సాగు చేసే భూములకు రైతుబంధు వర్తింపజేయాలని, రైతుబంధు పరిమితిపై అందరి సలహాలు తీసుకోవాలని సూచించారు.