మహబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో (SLBC Tunnel Mishap) చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించి. అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితిని బయట ఉన్న అధికార యంత్రాంగానికి చేరవేశారు. దీంతో అధికారులు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చించి అక్కడి మట్టి దిబ్బలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన మెటీరియల్ లోపలికి తరలిస్తూ బయటికి తీసుకు వస్తున్నారు. తాజాగా అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలు నమస్తే తెలంగాణకు చిక్కాయి.
కాగా, సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మందితో కూడిన సైన్యం బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే ఘటనా స్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా, సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి. మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డుపడుతున్నాయి. వాటిని దాటుకుని ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో పైకప్పు కూలిన ప్రాంతానికి 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. అందులో 8 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. వారి పేర్లు పిలిచినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. ఆక్సిజన్ కూడా లేకపోవడంతో వారు సజీవంగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
టన్నెల్ పనుల్లో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో సొరంగమార్గంలో 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర నీరు, బురద నిలిచిఉంది. ఈ నేపథ్యంలో 11వ కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో వెళ్లిన సహాయక సిబ్బంది నుంచి 14 కి.మీ. వరకు నడుచుకుంటూ వెళ్లారు. అయితే ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నది. మిషన్‌కు రెండువైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయింది. దీంతో అతికష్టంమీద బోరింగ్ మిషన్ ముందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. కాగా, నీరు, మట్టి, బురద తోడేవరకు అందులో చిక్కుకున్న వారిని అందులోనుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల వెనకకు వచ్చిందని ఏజెన్సీ వెల్లడించింది. కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.