హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రక్రియను నిరసిస్తూ బిఎంఎస్ మినహా నాలుగు జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. రామగుండం రీజియన్లో 6 భూగర్భ గనులు, 4 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణిలో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భూపాలపల్లిలోనూ కార్మికులు తమ విధులకు హాజరు కాలేదు. అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.