హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హో దా కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిషరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశా రు. ప్రధాని ఆదివారం హైదరాబాద్ వస్తున్న సందర్భంగా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హా మీ మేరకు పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హో దా కల్పిస్తూ నిధులు విడుదల చే యాలని కోరారు. బయ్యారం ఉకు కర్మాగారం, ఖాజీపేటలో రైల్వే మ్యా నిఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు.
తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) నెలకొల్పాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు విడుదల చేయాలని, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, జవహర్ నవోదయ పాఠశాలలు 16 మాత్రమే ఉన్నాయని, జిల్లాకొకటి చొప్పున మరో 17, రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు సైనిక్ సూల్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రజల కోరిక మేరకు భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపాలని సూచించారు. జనగణన సందర్భంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లతో పాటుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.