Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో డొంక కదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల పేర్లను ఈడీ తన చార్జిషీట్లో చేర్చడం సంచలనంగా మారింది. భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్న ఈ కేసు చార్జిషీట్లో ప్రస్తావించిన వ్యక్తులకు త్వరలో నోటీసులు జారీ చేసి, విచారణకు పిలువనున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నాయి. ఈడీ చార్జిషీట్ నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పు పొందడానికి రాష్ట్ర సీఎం, అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ‘వసూల్ రాజా’ అవతారం ఎత్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ వర్గాలు, ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ఇండియాటుడే’ కథనం ఈ అనుమానాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి చెందిన ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి విరాళాలు ఇప్పించేందుకు అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ మేరకు ఏప్రిల్ 9న ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక విషయాలు ఉన్నట్టు ‘ఇండియాటుడే’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి భారీ ఎత్తున విరాళాలు ఇప్పించాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు ఆదేశాలు వెళ్లినట్టు ఈడీ ఆరోపించింది. దీంతో పలు రాష్ర్టాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొన్ని లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది. ఈ మొత్తం పరిణామాలను ‘ఓ ఆర్థిక మోసాన్ని ప్రణాళికాబద్ధంగా కప్పిపెట్టేందుకు జరిగిన ప్రయత్నం’గా ఈడీ అభివర్ణించింది. డొనేషన్ల రూపంలో యంగ్ ఇండియన్ సంస్థకు బదిలీ అయిన నిధులన్నీ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి చేరినట్టు ఈడీ తన చార్జిషీట్లో పేర్కొన్నది. యంగ్ ఇండియన్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి 76 శాతం షేర్లు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే సంస్థ ప్రచురిస్తున్నది. ఏజేఎల్‌కు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈ ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకొనేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. ఈ లావాదేవీలో నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చేతులు మారాయని తెలిపింది.
ఇండియాటుడే కథనం ప్రకారం.. యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2019-22 మధ్య తెలంగాణకు చెందిన నలుగురు కాంగ్రెస్ నేతలకు సూచించారు. రేవంత్ ఆదేశాలతో ఆ నలుగురు నేతలు యంగ్ ఇండియన్ కంపెనీకి 2022 జూన్‌లో రూ.80 లక్షల మేర విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన గాలి అనిల్‌కుమార్ (రూ.20 లక్షలు), మాజీ ఎమ్మెల్యే షబ్బీర్‌అలీ (రూ.20 లక్షలు), అప్పటి కాంగ్రెస్ నేత సుదర్శన్(రూ.15 లక్షలు), అప్పుటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఓ వ్యక్తి రూ.25 లక్షలను ఇచ్చినట్టు తెలిపింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఈ విరాళాలన్నీ యంగ్ ఇండియన్ కంపెనీకి చేరినట్టు వివరించింది.
తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, పంజాబ్ నుంచి కూడా ఇలాంటి విరాళాలే యంగ్ ఇండియన్ కంపెనీకి చేరినట్టు ఇండియా టుడే వెల్లడించింది. కాం గ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మాజీ కోశాధికారి పవన్ బన్సల్ సూచనలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేశ్.. యంగ్ ఇండియన్ కంపెనీకి చెరో రూ.25 లక్షలను 2022 ఏప్రిల్‌లో విరాళంగా ఇచ్చినట్టు పత్రిక తెలిపింది. డీకేకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రూ.2 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు వివరించింది. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నేత అమిత్ విజ్ 2015లో మూడు విడతల్లో యంగ్ ఇండియన్ కంపెనీకి రూ. 3.3 కోట్లను ట్రాన్స్ఫర్ చేసినట్టు వెల్లడించింది. ఈడీ తన చార్జిషీట్లో రేవంత్‌రెడ్డి, దివంగత అహ్మద్ పటేల్, పవన్బన్సల్తోపాటు డీకే శివకుమార్ పేరును కూడా ప్రస్తావించినట్టు పత్రిక వివరించింది.
యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇచ్చిన వారందరూ స్వచ్ఛందంగా ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. కొందరికి పదవి, టికెట్లు ఆశచూపి విరాళాలు సేకరిస్తే, మరికొందరిని రాజకీయ భవిష్యత్తు ఉండబోదని, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు సేకరించినట్టు వెల్లడించింది. ఇదంతా ఓ ఆర్థిక మోసాన్ని నేర్పుగా కప్పిపెట్టేందుకు జరిగిన ప్రయత్నమని అభివర్ణించింది. ఈ లావాదేవీలు పీఎంఎల్ఏ నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయో లేదో ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్లో ప్రస్తావించిన వ్యక్తులకు త్వరలో నోటీసులు జారీచేసి, విచారణకు పిలుస్తామని ఈడీకి అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు.
యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నది. ఈ క్రమంలో పలు కీలక విషయాలను వెల్లడించింది. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదనలేక యంగ్ ఇండియన్‌కి రూ.30 లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చానని, మరో రూ. 20 లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్‌సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు ఈడీ అఫిడవిట్లో తెలిపింది. అహ్మద్ పటేల్ తనకు ఏఐసీసీ కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తానని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్‌కు విరాళాలు తీసుకున్నారని రాజీవ్ గంభీర్ అనే మరో నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. అయితే తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడీ వెల్లడించింది.
‘నేషనల్ హెరాల్డ్’ కేసులో డీకే శివకుమార్ పేరును ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించడంపై మీడియా శుక్రవారం ఆయనను ప్రశ్నించింది. దీంతో నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు తాను, తన సోదరుడు రూ.25 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చామని డీకే అంగీకరించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నడిచే పేపర్‌కు విరాళం ఇస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బునే విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో తప్పేమీలేదని పేర్కొన్నారు. ఏఐసీసీ మాజీ కోశాధికారి పవన్ బన్సల్ ఆదేశాల ప్రకారమే తాము ఈ విరాళం ఇచ్చామన్న డీకే.. యంగ్ ఇండియన్ కార్యకలాపాల గురించి, ఈడీ ఆ కంపెనీపై దర్యాప్తు చేస్తున్న విషయం గురించి తనకు తెలియదని చెప్పారు. తాను, తన సోదరుడు ఇచ్చిన విరాళాలపై ఈడీ ఇప్పటికే ప్రశ్నించినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా డీకే తెలిపారు.